లోకంలో ఎన్నో దానాలు చేస్తూంటారు... కానీ ఈ అన్ని దానాలలోకి అన్నదానం చాలా విశిష్టమైనది. భగవంతుని సృష్టిలోని 84 లక్షల జీవరాశుల్లో.. ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేక ఆహార విధానాన్ని పరమేశ్వరుడు ముందుగానే నిర్ణయించేసి ఉంటాడు. అందుకే ఆయనకు పూజ చేసేటప్పుడు ఉపవాసం ఉండాలంటూంటారు. అలా ఉపవసించి.. పరమేశ్వరునికి నైవేద్యం సమర్పించడం ద్వారా.. పరమేశ్వరునికి నైవేద్యం పెట్టిన ఆహారం సృష్టిలోని సకల జీవులకు చేరుతుందనేది ఒక విశ్వాసం.
మరింత వివరంగా చెప్పాలంటే.... ఓ వ్యక్తి ఉపవాసం ఉండి పరమేశ్వరునికి పెట్టే నైవేద్యాన్ని... పరమేశ్వరుడు తాను మాత్రమే స్వీకరించకుండా తాను సృష్టించిన 84 లక్షల జీవరాశులకు పంచిపెడతాడని పురాణాలు చెప్తున్నాయి.
ఇక శుభకార్యాలు చేసేటప్పుడు అన్నదానాన్ని చేయాలి. అన్నం లేకుండా ఏ జీవరాశీ తన మనుగడని సాగించలేదు. అందుకే ఆకలి బాధతో ఉన్నవారికి అన్నదానం చేయడం ద్వారా శుభఫలితాలు లభిస్తాయి. అన్నదానానికి మించినది లేదని పెద్దలు కూడా అంటూంటారు. ధనమైనా, బంగారమైనా ఎంత దానం చేసినప్పటికీ... దానం పొందిన వ్యక్తి మరింత కావాలని కోరుకుంటాడే కానీ సంతృప్తి చెందడు.
అదే అన్నదానం చేసినట్లయితే దానం పొందిన వ్యక్తి కడుపు నిండి సంతృప్తి చెందిన తర్వాత మరింత అధికంగా కావాలని ఆశించడు. అన్నదానం చేస్తే భవిష్యత్తులో రాబోయే కార్యక్రమాలలో శుభఫలితాలను ఇస్తుంది. అన్నదానం చేయడం ద్వారా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అభిప్రాయభేదాలు తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు.