Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాఘమాసం(జనవరి 29) మహత్మ్యం.. ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు

హిందూ సాంప్రదాయాల్లో ప్రతి మాసం పవిత్రమైనదే. ప్రతి మాసానికి ఓ ప్రత్యేకత ఉన్నది. చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభమవుతోంది. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో సాక్షాత్తు

మాఘమాసం(జనవరి 29) మహత్మ్యం.. ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు
, శనివారం, 28 జనవరి 2017 (15:12 IST)
హిందూ సాంప్రదాయాల్లో ప్రతి మాసం పవిత్రమైనదే. ప్రతి మాసానికి ఓ ప్రత్యేకత ఉన్నది. చాంద్రమానం ప్రకారం పదకొండవ మాసమైన మాఘమాసం ప్రారంభమవుతోంది. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, మాఘమాసంలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెలలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు లింగ రూపం ధరించాడు. అంతేకాదు చదువులతల్లి సరస్వతి జన్మించింది కూడా వసంత పంచమి అయిన మాఘ మాసంలోనే. అంతేకాదు ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుడు తన రథంపై సంచారానికి బయలు దేరుతాడు అని ప్రతీతి. 
 
మాఘ మాసం పుణ్యస్నానాలకు ప్రతీతి. ఈ మాసంలో మకర లగ్నంలో సూర్య భగవానుడు ఉండే సమయంలో చేసే స్నానాలకు విశేషం ఉన్నది. ఆ జలం అంతా హరి పరిపూర్ణుడై ఉంటాడు అని, ఆ విధంగా విష్ణుమూర్తి కృపకు పాత్రులమవుతామని చెప్పబడింది. ఈ మాసం అంతా తెల్లవారుఝామునే లేచి స్నానం ఆచరించటం ప్రధానం.“దుఃఖ దారిద్ర్యనాశాయ శ్రీ విష్ణోస్తోషణాయచ, ప్రాతఃస్నానం కరోమ్యద్య మాఘే పాపవినాశనం" అనే ఈ శ్లోకాన్ని పఠిస్తూ, నదులలోగాని, చెరువులలో గాని, బావుల వద్ద గాని, స్నానం చెయ్యడం విశేషం. పైన చెప్పిన ప్రదేశాలలో కుదరకపోతే, కనీసం ఇంట్లో స్నానం చేస్తునప్పుడు, గంగ, గోదావరి, కావేరి వంటి పుణ్య నదులను తలుచుకుంటూ స్నానం ఆచరించవలెను.
 
స్నానాంతరం ఏదైనా ఆలయానికి వెళ్ళడం మంచిది. ఈ మాసంలో శివాలయంలో నువ్వుల నూనెతో దీపాలను వెలిగించవలెను. ఈ మాసంలోని ఆదివారాలు సూర్య ఆరాధనకు ఎంతో ఉత్కృష్టమైనవి. అసలు మాఘ మాసంలో ప్రతివారు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోవాలి. ఉపనయనం అయిన వారు మంత్రంతో అర్ఘ్యం ఇస్తారు. అలాకాని పక్షంలో ప్రతి ఒక్కరూ ప్రొద్దున్నే సూర్యోదయ సమయంలో, శుచిగా, సూర్యుడి నామాలు చెబుతూ అర్ఘ్యం ఇచ్చుకోవాలి. కనీసం ప్రతి ఆదివారం తప్పనిసరిగా సూర్యోదయ సమయంలో సూర్యుడిని ఆదిత్య హృదయంతో స్తుతించడం వల్ల, అన్ని అనారోగ్యాలు నశించి, ఆయురారోగ్యాలను కలుగచేస్తాడు సూర్య భగవానుడు. ఇది శాస్త్ర వచనం. 
 
ఈ మాసంలోని శుక్లపక్ష తదియనాడు బెల్లము, పప్పులను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఈ మాసంలో రథ సప్తమితో శ్రీ పంచమి, వరచతుర్ధశి, వరుణ షష్టి, భీష్మ అష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పూర్ణిమ విశేషమైన దినాలు. ముఖ్య తిధులు : - 1. శుద్ధ విదియ 2. శుద్ధ చవితి 3. శుద్ధ పంచమి 4. శుద్ధ షష్టి 5. శుద్ధ సప్తమి 6. అష్టమి 7. నవమి 8. ఏకాదశి 9. ద్వాదశి 10. త్రయోదశి 11. మాఘ పూర్ణిమ 12. కృష్ణపాడ్యమి 13. కృష్ణ సప్తమి 14. కృష్ణ ఏకాదశి 15. కృష్ణద్వాదశి 16. కృష్ణ చతుర్దశి 17. కృష్ణ అమావాస్య.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలలో పట్టుబడిన వ్యక్తి ఉగ్రవాది... హిందూ దేవాలయాలపై కన్నేశారా?