అమ్మా, రామభద్రుడు పద్మదళ విశాల నయనాలతో సర్వలోక మనోహరంగా వుంటాడు. దయార్ద హృదయుడు. సూర్యసమతేజస్వి, పృధ్వికున్నంత ఓరిమి వుంది. ధీశక్తిలో బృహస్పతి. కీర్తికి ఇంద్రుడు.
సర్వభూత రక్షణతో తన పరిజన రక్షణ కూడా చూసుకునేవాడు. ముందు తన జీవనధర్మాన్ని నిర్వహిస్తూ లోకధర్మ రక్షణ చేస్తాడు. లోక మర్యాద వీడకుండా సర్వవర్ణాలనూ ధర్మపదాన నిలబెడతాడు. బ్రహ్మచర్య నియమంతో, సజ్జనులకు సాయపడుతూ, ఇహపరాలను చూసుకుంటూ వుంటాడు. రాజనీతి నిపుణుడు, విద్యాంసులను నిరంతరం ఆరాధిస్తాడు. వినయ, విద్యాసంపన్నుడు. శత్రుసంతాపకుడు. యజుర్వేదం అధ్యయనం చేసినవాడు. ధనుర్వేదం కరతలామలకం. వేదవేత్తల పూజలు పొందేవాడు.
విపులాంసుడు, దీర్ఘబాహుడు, శంఖకంఠుడు, అరుణారుణ నయనుడు. ఆయన కంఠం దుందుభిస్వనంలా వుంటుంది. శరీరం అంతా తీర్చిదిద్ది హెచ్చుతగ్గులు లేకుండా వుంటుంది. ఉరఃస్థలం, మణికట్టు, పిడికిలి చాలా దృఢంగా వుంటాయి. ఆయన నడక, నాభి, మాట బహుగంభీరాలు. సింహ, శార్దూల, గజ, వషభ గమనుడు.
దేశ కాల పాత్రాలు గ్రహించి సంగ్రహానుగ్రహాలు చేయగలవాడు. సర్వజన ప్రియంగా మాట్లాడగలవాడు అని హనుమంతుడు చెపుతుండగా సీతాదేవికి ఆనంద బాష్పాలతో హృదయం సంతోష తరంగితం అయింది.