Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల కొండపై గది దొరకదు.. కానీ సొంత గెస్ట్‌ హౌస్‌లు కావాలంటే చాలా ఈజీ...!

తిరుమల కొండపై ఒకరోజు ఒస చేయడానికే గది దొరకదు. ప్రైవేటు లాడ్జీలేవీ లేని తిరుమలలో తితిదే కాటేజీలు తప్ప వేరే దారి లేదు. అలాంటి చోట సొంత గెస్ట్ హౌస్‌ ఎలా సాధ్యం? ఎవరు ఇస్తారు? అనే అనుమానాలు కలుగవచ్చు.

తిరుమల కొండపై గది దొరకదు.. కానీ సొంత గెస్ట్‌ హౌస్‌లు కావాలంటే చాలా ఈజీ...!
, శుక్రవారం, 8 జులై 2016 (12:29 IST)
తిరుమల కొండపై ఒకరోజు ఒస చేయడానికే గది దొరకదు. ప్రైవేటు లాడ్జీలేవీ లేని తిరుమలలో తితిదే కాటేజీలు తప్ప వేరే దారి లేదు. అలాంటి చోట సొంత గెస్ట్ హౌస్‌ ఎలా సాధ్యం? ఎవరు ఇస్తారు? అనే అనుమానాలు కలుగవచ్చు. తిరుమలలో ప్రైవేటు లాడ్జీలు లేని మాట వాస్తవమే. తితిదే ఎవరికీ సొంత గెస్ట్ హౌస్‌ ఇవ్వదు. అయితే మీరు కోట్లు కుమ్మరించడానికి సిద్ధమైతే తిరుమలలోని మఠాల ద్వారా సొంత గెస్ట్ హౌస్‌ సంపాదించడం పెద్ద సమస్య కాదు. పుష్పగిరిమఠంలో జరిగిన ఈ వ్యవహారాన్ని మీరే చూడండి.
 
కడప ప్రధాన కేంద్రమైన పుష్పగిరి మఠానికి 1997సంవత్సరంలో తితిదే తిరుమలలో స్థలం కేటాయించింది. ఇందులో 34 గదులతో భారీ భవంతి నిర్మించింది. దీని కోసం భక్తుల నుంచి విరాళాలు సేకరించింది. మఠానికి 500 మంది దాకా దాతలున్నారు. వీరు ఒక్కొక్కరు రూ.40 వేల నుంచి రూ.లక్షలు ఇచ్చిన వారు ఉన్నారు. అలాంటి దాతలు తిరుమలకు వచ్చినప్పుడు సంవత్సరంలో ఇన్ని రోజులని వారికి గదులు కేటాయిస్తారు. మిగిలిన రోజుల్లో మిగతా భక్తులకు ఇచ్చుకుంటారు. అయితే ఇది అదుపుతప్పి మితిమీరి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలా మారిపోయింది. 
 
నిర్మాణ సంస్థలు అపార్టుమెంట్లు నిర్మిస్తే అందులోని ప్లాట్లను ఎలా అమ్మేస్తారో... పుష్పగిరి మఠంలోని గదులను అలా ఇచ్చేస్తున్నారు. బొగ్గుగనుల సంస్థ అయిన సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (కొత్తగూడెం, ఖమ్మంజిల్లా)తో మఠం 2009లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం సింగరేణి సంస్థ ఏకమొత్తంగా రూ.కోటి మఠానికి చెల్లించాలి. ఇందుకుగాను మఠంలోని ఏడు గదులను జీవితకాలం ఆ సంస్థకు ఇవ్వాలి. ఈ మేరకు 10.6.2009వ తేదీన ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి నుంచి మఠంలోని ఏడు గదులు సింగరేణి సంస్థ ఆధీనంలో ఉన్నాయి. ఆ సంస్థ అధికారులు, ఉద్యోగులు తిరుమలకు వచ్చినప్పుడు వారికి కేటాయిస్తున్నారు. సింగరేణి ఇచ్చిన కోటి రూపాయలు ఇక తిరిగి ఇచ్చేది ఉండదు.
 
ధార్మిక కార్యక్రమాల కోసం తితిదే ఇచ్చిన స్థలంలో నిర్మించిన గదులకు సంబంధించి పుష్పగరి ట్రస్టు ఈ విధమైన ఒప్పందం కుదుర్చుకోవచ్చా..? గదుల నిర్మాణం కోసం డబ్బులు తీసుకున్నారనుకున్నా.. ఈ ఒప్పందం కుదరడానికి ఆరేళ్ళ ముందే 2003 సంవత్సరంలో నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవం జరిగిపోయింది. అంటే ఆ గదుల నిర్మాణానికి అప్పటికే దాతల నుంచి విరాళాలు తీసుకున్నారు. అదే గదులను చూపించి మళ్ళీ సింగరేణి వద్ద డబ్బులు కూడా వసూలు చేశారన్నమాట. ఇంకా ఇలాంటి ఒప్పందాలు ఇంకా ఇతర సంస్థలతో ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం ప్రస్తుతం చర్చకు దారితీస్తోంది.
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఒకప్పుడు తిరుమలలో కాటేజీల పథకం అమలు చేసింది. దీని ప్రకారం తితిదే నిర్మించదలచుకున్న కాటేజీకి దాతలు విరాళం ఇవ్వవచ్చు. ఇందుకుగాను ఏడాదిలలో నెల రోజుల పాటు ఆ దాతకు లేదా ఆ దాత ద్వారా వచ్చే వాళ్ళకు కాటేజీ కేటాయిస్తారు. మిగిలిన రోజుల్లో ఇతర భక్తులకు ఇస్తారు. మొదట్లో తితిదే తన అవసరాల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని తరువాత ఆపేసింది. తితిదే ఏ సంస్థతోను ఎంఓయు (ఒప్పందం) కుదుర్చుకోలేదు. కానీ పుష్పగిరిమఠం మాత్రం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలాగా గదులను ప్రైవేటు వారికి ఇవ్వడానికి ఎంఓయులు చేసుకోవడం విచిత్రం.
 
తిరుమలలో చీమ చిటుక్కుమన్నా తమకు తెలిసిపోతుందని చెప్పుకునే తితిదే విజిలెన్స్ విభాగం పుష్పగిరి మఠం వ్యవహారాన్ని ఇప్పటిదాకా ఎందుకు పసిగట్టలేకపోయిందనేది ప్రశ్న. 2009లో ఒప్పందం జరిగితే అదీ ప్రభుత్వ రంగ సంస్థ ఒప్పందం చేసుకుంటే ఆ సంగతి తితిదేకి తెలియకపోవడం ఆశ్చర్యకరం. మఠాల్లో ఎవరూ బస చేస్తున్నారనే వివరాలు కూడా తితిదేకి చేరడం లేదనేందుకు పుష్పగిరి మఠం వ్యవహారమే నిదర్సనం. ఆ వివరాలు ఎప్పటికప్పుడు తెప్పించుకుని ఉంటే సింగరేణి సంస్థ ఉద్యోగులు సంవత్సరాల తరబడి పుష్పగిరి మఠంలోనే ఎందుకు బస చేస్తున్నారనేది సులభంగానే బయటికి వచ్చేది.
 
దేశవ్యాప్తంగా ఉన్న 34 మఠాలు ఆధ్మాత్మిక కార్యక్రమాల పేరుతో తిరుమలలో తితిదే నుంచి స్థలాలను తీసుకున్నాయి. ఇక్కడ నిత్యపూజలతో పాటు హిందూ ధర్మప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ మఠాలు స్టార్ హోటళ్లను తలదన్నేలా భవంతులు నిర్మించాయి. అందులో గదులను యాత్రికులకు అద్దెకు ఇస్తున్నాయి. ఒక్కో గదికి వేల రూపాయలు వసూలు చేస్తూ కోట్ల రూపాయలు నిర్వహిస్తున్నాయని పుష్పగిరి మఠం వ్యవహారంతో బయటపడింది.
 
ఇంకా ఏవైనా మఠాలు ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకున్నాయా? ఈ పేరుతో కోట్ల రూపాయలు చేతులు మారాయా? ఏమో? ఇప్పటికైనా మఠాల్లో జరుగుతున్న తంతుపై తితిదే విచారణ జరిపిస్తుందా? అనేది సందేహంగా ఉంది.. మఠాలలో జరుగుతున్న తతంగంపై తితిదే ఉన్నతాధికారులతో పాటు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకాళహస్తిలో భిక్షాల గోపురం కూలిపోతోంది... పట్టించుకోరా...!