సోదరీసోదరుల దృఢమైన అనుబంధమునకు గుర్తుగా రాఖీ పండుగ జరుపుకోవడం సంప్రదాయము. ఈ రోజున ఒక సోదరి రాఖీ అనే పవిత్ర తోరాన్ని తన సోదరుడి మణికట్టుకు కట్టి అతడు సంతోష ఆనందాలతో అన్ని రంగాలలోను విజయం పొందాలని, సోదరుడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడుతానని వాగ్దానం చేస్తాడు.
ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. అది ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా, ఒక సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది. ఈ పండుగ కేవలం సోదరీసోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది.
పురాణాలలో రక్షా బంధనం: రాక్షసుల రాజు మహాబలి తన భక్తితో విష్ణువును మెప్పించి తన రాజ్యరక్షణా భారం విష్ణువుపై పెడతాడు. దానితో విష్ణువు బలి రాజ్యంలోనే ఉండిపోవలసి వస్తుంది. అపుడు విష్ణువు భార్య అయిన లక్ష్మీదేవి ఒక బ్రాహ్మణ స్త్రీ రూపంలో బలి వద్దకు వచ్చి శ్రావణ పూర్ణిమ రోజున బలి చేతికి రాఖీ కట్టి నేను నీ సోదరి సమానురాలను అంటుంది. సోదరిగా తన కోరిక మేరకు విష్ణువును వదలివేయమంటుంది. ఆమె కట్టిన రాఖీ చర్యకు మెచ్చిన బలి శ్రీమహావిష్ణువును ఆమెతో పాటు శ్రీ మహావిష్ణువును కూడా వైకుంఠానికి పంపేస్తాడు.
అట్లే శిశుపాలుడితో జరిగిన ఒక యుద్ధంలో కృష్ణుడు తన చేతి వేలికి గాయం చేసుకుంటాడు. రక్తం బాగా కారుతుంటే, అక్కడే ఉన్న ద్రౌపతి తన చీరకొంగు చించి అతని వేలికి కడుతుంది. అపుడు శ్రీ క్రిష్ణుడు ఆమెను సోదరి సమానురాలిగా భావించి ఆమె కట్టిన చీర కొంగును రక్షాబంధనంగా భావించి ఆమెను తదుపరి రోజులలో కౌరవులు చేసిన వస్త్రాపహరణం నుండి రక్షిస్తాడు.
పురాణాలే కాదు చరిత్రలో కూడా రాఖీకి సంబంధించిన కథలు చాలానే ఉన్నాయి. మన దేశం మీదకి అలెగ్జాండర్ దండెత్తి వచ్చినప్పడు, అతణ్ని పురుషోత్తముడు అనే రాజు ఎదుర్కొన్నాడు. రోజులు గడిచేకొద్దీ యుద్ధంలో పురుషోత్తముడిదే పైచేయిలా కనిపించసాగింది. అతని చేతిలో అలెగ్జాండర్ చనిపోవడం ఖాయమనుకున్నారంతా.
ఆ విషయం తెలుసుకొన్న అలెగ్జాండర్ భార్య రొక్సానా, పురుషోత్తముడికి ఒక రాఖీని పంపిందని చెబుతారు. దాంతోపాటు `యుద్ధంలో కనుక నా భర్త నీ కంటపడితే దయచేసి అతణ్ని ఏమీ చేయవద్దు` అన్న సందేశాన్ని కూడా అందించిందట. ఆ తరువాత యుద్ధంలో అలెగ్జాండర్‌ను హతమార్చే అవకాశం వచ్చినా పురుషోత్తముడు తన మాటను నిలబెట్టుకున్నాడట.
15వ శతాబ్దంలో రాజస్థాన్‌లోని చిత్తోడ్ ప్రాంతాన్ని, కర్నావటి అనే రాణి పాలించేది. ఒకసారి ఆమె మీదకు బహదూర్ షా అనే శత్రువు దండెత్తి వచ్చాడు. అతణ్ని తన శాయశక్తులా ఎదుర్కొంటూనే, సాయానికి రమ్మంటూ అప్పటి మొఘల్ రాజు హుమాయున్‌కి రాఖీని పంపిందట కర్నావటి. దాన్ని అందుకున్న వెంటనే, హుమాయున్ తన సైన్యాన్ని చిత్తోడ్ వైపు మళ్లించాడు. ఆ యుద్ధంలో హుమాయున్, కర్నావటిని కాపాడలేకపోయినా... బహదూర్‌షాని మాత్రం ఓడించగలిగాడు.
రాఖీ రోజు ఉదయాన్నే తలార స్నానం చేసి, మంచి బట్టలు వేసుకుని రాఖీకి సిద్ధపడతారు. అక్కచెల్లెళ్లంతా బుద్ధిగా కూర్చున్న అన్నదమ్ములకి రాఖీని కడతారు. రాఖీని కట్టేటప్పడు `యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల` అనే స్తోత్రాన్ని కూడా చదువుతారు. `ఎలాగైతే ఆ విష్ణుమూర్తి, బలిచక్రవర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇతణ్ని అన్ని కాలాలలోనూ విడవకుండా ఉండు` అని దీని అర్థం. ఆ తరువాత హారతిని ఇచ్చి, నుదుట తిలకాన్ని దిద్దుతారు. దానికి సంతోషపడిపోయే సోదరులు తమ ప్రేమకు గుర్తుగా వారికి చక్కటి బహుమతులను అందిస్తారు.