Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రకృతి - దైవానికి మధ్య ఉన్న వ్యత్యాసమేమిటో తెలుసా...?

భగవానుడు అత్యంత సృజనాత్మక ప్రతిభతో ఈ భువిపై ప్రకృతిని తీర్చిదిద్దాడు. మాతృమూర్తి లక్షణాలన్నీ ప్రకృతికి ఉన్నాయి. క్లిష్టమైన జీవన పరిస్థితుల్ని సైతం ఇది తట్టుకుంటుంది. ఓరిమితో తన ధర్మం తాను సదా పాటిస్తుంది. సృజనలో భాగంగా, అన్ని సంవిధానాల్నీ దైవం ఒక క్ర

ప్రకృతి - దైవానికి మధ్య ఉన్న వ్యత్యాసమేమిటో తెలుసా...?
, సోమవారం, 10 ఏప్రియల్ 2017 (21:40 IST)
భగవానుడు అత్యంత సృజనాత్మక ప్రతిభతో ఈ భువిపై ప్రకృతిని తీర్చిదిద్దాడు. మాతృమూర్తి లక్షణాలన్నీ ప్రకృతికి ఉన్నాయి. క్లిష్టమైన జీవన పరిస్థితుల్ని సైతం ఇది తట్టుకుంటుంది. ఓరిమితో తన ధర్మం తాను సదా పాటిస్తుంది. సృజనలో భాగంగా, అన్ని సంవిధానాల్నీ దైవం ఒక క్రమపద్ధతిలో నిర్దేశించి ఉంచాడు. అవన్నీ ఉమ్మడిగా సర్వసహజంగా తమ బాధ్యతల్ని నిర్వహిస్తాయి.
 
భగవంతుడి సృజనలో- ప్రయోజనం లేని పదార్థమన్నదే లేదని వేదాలు చెబుతాయి. చెట్లు ప్రాణవాయువునిస్తాయి. చెరువులు నీటిని సమృద్ధిగా నిల్వ చేస్తాయి. ఇలా ప్రకృతి సమస్తం చైతన్య లక్షణం కలిగి ఉంటుంది. ఇదే ధర్మం అంతటా కనిపిస్తుంటుంది. మానవుడి పురోగమనానికి సహకరించే లక్షణాలన్నింటినీ భగవానుడే ప్రకృతిలో నిక్షిప్తం చేశాడు.
 
భూమిపై మానవుడే కీలకం. అతడి వికాసం కోసమే ఆ సృజనకారుడు ప్రకృతికి ఇంతటి ప్రాముఖ్యమిచ్చాడు. అన్ని జీవులూ పరస్పరం సహకరించుకుంటేనే మనుగడ సాగుతుందని దైవం నిర్దేశించాడు. ప్రకృతిలో దేని ధర్మాన్ని అది తనకు తెలియకుండానే నిర్వర్తిస్తుంది. పువ్వు పరిమళించేందుకు ఎవరూ ప్రయత్నించాల్సిన అవసరం లేదు. అది ఓ స్వయం ప్రవర్తక క్రియ. తేనెటీగలు పువ్వుపై వాలి తేనెను స్వీకరిస్తాయి. ఈ సేకరణకు ఎవరి సహాయమూ అక్కర్లేదు. అంత స్నేహపూర్వకంగా రూపుదిద్దుకొంది ప్రకృతి!
 
ప్రకృతిలో సహజసిద్ధంగానే ఈ పర హిత తత్వం గోచరిస్తుంది. ఈ విధానమంతా మరింత జీవన వికాసం కోసమే. సృజన లక్ష్యమూ ఇదేనట. భూమిపై జీవనం వికసించేకొద్దీ జ్ఞానం అభివ్యక్తమైంది. దానితో పాటు మనిషిలో ఆశలు, స్వార్థ భావనలూ పుట్టుకొచ్చాయి. సరిగ్గా అప్పుడే ఎవరో మార్గదర్శనం చేసినట్లు, ప్రకృతి వెల్లివిరిసింది. మానవ వికాసం కోసం తన వంతు పాత్ర నిర్వహించసాగింది. ఏకాంతంగా కూర్చొని ఆలోచించడంతో, మానవుడిలో గొప్ప చింతనలు కలిగాయి. 
 
ఆర్యభట్ట తదితర శాస్త్రజ్ఞులు విజ్ఞాన దీపాలు వెలిగించారు. ‘ప్రశ్నోపనిషత్తు’ చెప్పినట్లు- ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు మనిషిలో ఉదయించాయి. దీనికీ ప్రకృతే కారణమైంది. సరికొత్త యోచనలు ప్రాణం పోసుకున్నాయి. ప్రకృతి ధర్మం మనిషి ఆలోచనలకు అనుకూలంగా ఉండటం నూతన ఆవిష్కరణలకు మూలమైంది.
 
బ్రహ్మసుప్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన బ్రహ్మగుప్తుడు; బీజ గణితం, గ్రహ గణితం వంటివాటిని సూత్రీకరించిన భాస్కరాచార్యుడు అసాధారణ సాధకులుగా కీర్తి గడించారు. మహారాష్ట్రలోని సాగరేశ్వర్‌ అరణ్య ప్రాంతంలో బ్రహ్మగుప్తుడు, ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన గుహలో భాస్కరాచార్యుడు శాస్త్రీయ, తాత్విక ఆలోచనలు చేశారంటారు. ఏకాంతంలోనే భాస్కరాచార్యుడు మహాభాస్కరీయం, లఘుభాస్కరీయం రాశాడని ప్రతీతి. ప్రకృతి ఆవిర్భావానికి పూర్వం శూన్యం ఉండేదని తెలుసుకొన్న భాస్కరుడు- ఆ శూన్యం విలువను సూచించేందుకే ‘0’ను సంకేతంగా వాడాడు. గుండ్రటి ఆ సంకేతం భూమికి గుర్తు. ఇలా ప్రకృతి- మానవ వివేకానికి, అతడి జీవితంలో మహనీయతకు కారణమైంది. కణాదుడు, నాగార్జునుడు వంటి శాస్త్రజ్ఞులు ప్రకృతి ఆరాధకులు కావడం గమనించాల్సిన విషయం.
 
మనిషిలో కోరికలు పెరగడానికి ప్రకృతి దోహదం చేస్తుంది. పలు రకాల భావనల్ని అతడిలో సృష్టిస్తుంది. వినీల ఆకాశంలో పక్షిలా ఎగరాలన్న మానవుడి కోరికకు ఈ సృజనే మూలం. దైవమే సృజించి మానవుడికి వరంగా ప్రసాదించిన ప్రకృతి పట్ల కొన్నేళ్లుగా అమానుష పోకడలు పెచ్చరిల్లుతున్నాయి. తానుగా సృష్టించలేని దేన్నీ ధ్వంసం చేసే హక్కు, అధికారం మనిషికి లేవు. ప్రకృతి విషయంలోనూ అది వర్తిస్తుంది, వర్తించాలంటున్నారు అనువజ్ఞులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తితిదే 10 వారాల ప్రయోగం... శ్రీవారి బ్రేక్ దర్శనాల్లో ప్రయారిటీ లేదట