బ్రహ్మాండపురమను గ్రామమున పరిపూర్ణాచార్యులు, ప్రక్రృతాంబ అను ధర్మగరిష్టాపరులైన విశ్వబ్రాహ్మణ దంపతులు భక్తి పారవశ్యంతో శివ పూజలాచరిస్తూ, అతిథి అభ్యాగదులనాదరిస్తూ, దానధర్మములు చేయుచూ జనులందరి మన్ననలు పొందుతూ నివసించసాగిరి. వారికి ఎంతటి పేరుప్రతిష్టలు, ధనధాన్యాదులు ఉన్నా సంతాన భాగ్యము మాత్రము కలగ లేదు. వారు కాశీక్షేత్రమునకేగి విశ్వనాధుని దర్శించుకుని సంతాన ప్రాప్తి కలిగించమని వేడుకోవాలని నిశ్చయించుకున్నారు. అంతట దంపతులిరువురూ ఒక శుభ ముహూర్తమున కాశీ క్షేత్రమునకు బయలు దేరి మార్గమధ్యమున పుణ్య నదులందు పవిత్ర స్నానములాచరించుచూ, మందిరములందలి దేవీదేవతలను దర్శించుకుంటూ కాశీ నగరమునకు చేరారు.
అచట గంగానదిలో స్నానమాచరిస్తూ, విశ్వనాధుని దర్శించుకుంటూ, తమ కోర్కెను ఆ స్వామివారికి విన్నవించుకుంటూ గడపసాగిరి. అలా దైవ సాన్నిధ్యములో గడుపుతుంటుండగా ఒక దినమున ఆకాశమున అద్భుతమైన ఒక తోకచుక్క ఉద్బవించుటతో పండితులు, జ్ఞానులు, విజ్ఞులు వేదోక్త ప్రకారమ యజ్ఞయాగాదులు ప్రారంభించిరి. ఆ సమయమున ప్రక్రృతాంబకు దైవ సాక్షాత్కారం కలిగినది. స్వప్నమందు ముందుగా కాశీవిశ్వేశ్వరుడు దర్శనమిచ్చి తదనంతరము శ్రీమహావిష్ణువు కనిపించి, "పరమ పావనీ! దుష్టశిక్షణ, శిష్టరక్షణ గావించుటకు, నేనే స్వయముగా నీ గర్భమున ఉద్భవించెదను, అయితే సుపుత్రుడు జన్మించినంతనే నీ భర్తయైన పరిపూర్ణానందాచార్యులువారు శివైక్యమగుదురు" అని పలికి అద్రుశ్యమయ్యారు.
ప్రకృతాంబ ఉలికిపాటున లేచి, పతిని లేపి స్వప్నమున దర్శించిన విషయమంతయూ వివరించి, "నాధా! పుత్ర ప్రాప్తి కలుగుట భాగ్యమే కాని పతీవియోగము తాళలేనిది. నీవులేని సంతానమెంత గొప్పదైననూ, నాకక్కరలేదు, వెంటనే విశ్వనాధుని దర్శించుకొని, ఇచ్చిన వరమును వెనక్కు తీసుకొమ్మని వేడుకొని కాశీ క్షేత్రము వదిలి వచ్చిన దారిన వెనుదిరిగెదము" అని అభ్యర్థించింది. భయభ్రాంతురాలైయున్న తన ధర్మపత్నిని సముదాయిస్తు "జాతస్య మరణం ధృవం, దైవ కార్యమునకు మనల్ని ఎoచుకొనుటే మహాభాగ్యం, జరగవలసినది జరుగకమానదు. చింత వీడి శివ చింతనతో గడుపు" అని ఆమెను ఊరడించి ప్రశాంత పరిచాడు.
దైవ సన్నిధిలో శివ భగవానుడి సేవలో తరిస్తూ ఉండగా ఒక దినము భోజనాదులు ముగించుకొని నిద్రకుపక్రమిస్తుండగా ప్రక్రృతాంబకు, మిరుమిట్లు గొలిపే దివ్యకాంతి ఒకటి వచ్చి సుదర్శన చక్రము రూపమునకు మారి, తన గర్భమున ప్రవేశించినట్లు అనుభూతి చెందినది. తదుపరి ఆరు నెలల తరువాత అ పుణ్యవతికి తాను గర్భము దాల్చిన విషయము అవగతమై ఆ విషయము పతికి చెప్పగా, "ఇదే శివలీల కదా!" అని అబ్బురపడ్డాడు. ప్రక్రృతాంబకు నవమాసాలు నిండుతుండగా, ఆ దంపతులిరువురు తమ స్వగ్రామమైన బ్రహ్మండపురమునకు బయలు దేరారు. అలా వెళుతూ సరస్వతీ నదీ తీరమున ప్రయాణిస్తుండగా, ప్రక్రృతాంబకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. పరిపూర్ణానంద ఆచారి వారు ఎడ్ల బండినాపించి అక్కడే పురుడు పోయించడానికి తాత్కాలిక ఏర్పాట్లు గావించి, ఒక మర్రిచెట్టు కింద శివ ధ్యానమునకుపక్రమించాడు.
బ్రహ్మ తేజస్సుతో ఆజానబాహువులతో పురుషోత్తముడు బాలునిగా జన్మనెత్తి కెవ్వుకేక పెట్టాడు. శిశువు రూపమున అవతరించిన అవతార పురుషుని రోదన చెవిని సోకినంతనే శివధ్యానములోనున్న పరిపూర్ణానందదాచార్యులవారు దేహమును త్యజించి, వారి ఆత్మను పరమాత్మలో ఐక్యముగావించారు. పుత్రోదయమైన కొంతసేపటికి ప్రక్రృతాంబకు పురిటి మైకం వదిలి తన పొత్తిళ్ళలో బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్న బాలుని, పక్కనే బ్రహైక్యమైయున్న భర్తను గాంచి ఏమీ పాలుపోక చూస్తుండగా, అటుగా వెల్తున్న అత్రి మహర్షి అది గమనించి దివ్యదృష్టితో అంతయూ తిలకించి ఆ పవిత్ర మాతృమూర్తి చెంత చేరి,"అమ్మా! మీరు కారణజన్ములు, ఈ అవతార పురుషుని జన్మనిచ్చటకు మీరు జన్మలు పొందినారు, ఆ శ్రీ హరి అవతరించుటకు మిమ్ములనెంచుకొనుట మీ భాగ్యము" అని నుడివెను. అంతట ఆ సాద్వీమణి, తన బిడ్డను స్వీకరించి, పెంచి, పోషించి, విద్యాబుద్ధులు నేర్ప జ్ఞానపరిపూర్ణుని చేయమని అత్రి మహర్షిని అర్థించినది. అత్రి మహర్షి దైవకార్యములో తన పాత్ర కూడా ఉన్నదని గ్రహించి ఆ బాలుని స్వీకరించాడు. అంతట ప్రక్రృతాంబ అక్కడే పద్మాసనంమందు కూర్చొని, మనోవాక్కాయ కర్మలను త్యజించి, మనో చిత్త వాయువులను ఐక్యము చేసి అరిషడ్వర్గాలను భేదించి సహస్త్రారము ద్వారా శివైక్యము పొందినది.
అత్రి మహర్షి పరిపూర్ణానందాచార్యులు ప్రక్రుతాంబల దేహములను ఒకే చోట సమాధి గావించి ఆ దివ్య బాలుని తన ఆశ్రమమునకు కొని పోయి, " వీరంభొట్లయ్య"అని నామకరణము చేసి జాగ్రత్తగా చూసుకొన సాగిరి. - ఇంకా వుంది