భాగవతంలో ఏముంది? ధర్మం ఉంది. సత్య దర్శనం ఉంది. దాన్ని నిర్మొహమాటంగా బోధించి మనిషిని సరైన మార్గంవైపు మళ్ళించే తత్వం ఉంది. అదే సుఖజీవనానికి, తద్వారా మోక్షానికి మార్గమనే జ్ఞాన బోధ ఉంది.
అసత్య వస్తువును పట్టుకుంటే మరణ భయం కలుగుతుంది. మరణభయంలో అజ్ఞానం, అవిద్య ఉన్నాయి. అవి జీవిని అధోగతికి చేర్చుతాయి. కాబట్టి ఏది సత్యమో దాన్ని పట్టుకోగలగాలి. భాగవతాన్ని విన్నవారు లేక చదివినవారు మాత్రమే ఆ సత్యాన్ని తేలికగా పట్టుకోగలరు. దేనికైనా తట్టుకోగలరు. అలా పట్టుకునే జీవితసత్యాల గురించి భాగవతంలో ప్రతిపాదన చేశారు.
ఎవరు భాగవతాన్ని వింటున్నారో లేక చదువుతున్నారో వారికి సత్యంపట్ల పూనిక కలుగుతుంది. ఈశ్వరుడి (అంతర్యామి) పట్ల దృష్టి మరలుతుంది. ఆయన పాదాలు పట్టుకున్నవాళ్లు ఎలా తరించారో భగవంతుడి భక్తుల గాథలుగా భాగవతం బోధిస్తోంది.
అంత సరళంగా భాగవతాన్ని శుక బ్రహ్మ ప్రవచనం చేశారు. దాన్ని అక్షరబద్ధం చేసింది వ్యాసభగవానుడు. మన అదృష్టం కొద్దీ ఆ జ్ఞాన సంపద మనందరికీ అందుబాటులో ఉంది. అందుకోగలిగిన వారికి ఆనందం కలుగుతుంది. అందుకోలేనివారికి అయోమయం మిగులుతుంది.