Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాలర్ శేషాద్రి నిజంగా నిర్ధోషా..?

డాలర్ శేషాద్రి గురించి పెద్దగా పరిచయమక్కర్లేదు. ఒక పెద్ద డాలర్‌తో తిరుమల శ్రీవారి పక్కన ఎప్పుడూ నిలబడుకుని విఐపిలతో ఫోటోలు తీసుకునే ఈయనంటే అందరికీ తెలుసు. అలాంటి డాలర్ శేషాద్రిపై గతంలో ఎన్నో రకాల ఆరోప

Advertiesment
Dollar Seshadri
, ఆదివారం, 20 ఆగస్టు 2017 (15:28 IST)
డాలర్ శేషాద్రి గురించి పెద్దగా పరిచయమక్కర్లేదు. ఒక పెద్ద డాలర్‌తో తిరుమల శ్రీవారి పక్కన ఎప్పుడూ నిలబడుకుని విఐపిలతో ఫోటోలు తీసుకునే ఈయనంటే అందరికీ తెలుసు. అలాంటి డాలర్ శేషాద్రిపై గతంలో ఎన్నో రకాల ఆరోపణలు వచ్చాయి. సాక్షాత్తూ తిరుమల వెంకన్నకు చెందిన డాలర్లనే ఈయన కొట్టేశారని కేసులు కూడా నమోదయ్యాయి. కానీ ఈయననేమీ చేయలేకపోయారు. ఎన్నో సంవత్సరాల పాటు డాలర్ల కేసు నడిచి చివరకు శేషాద్రి నిర్ధోషి అని క్లీన్ చిట్ వచ్చింది. కానీ భక్తులు మాత్రం అది నమ్మడం లేదు. కారణం ఏంటి.
 
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో దశాబ్దం క్రితం పెనుసంచలనం రేపిన శ్రీవారి బంగారు డాలర్ల కుంభకోణం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. కుంభకోణంలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాలర్ శేషాద్రి నిర్దోషి అని రాష్ట్ర హైకోర్టు 2014వ సంవత్సరంలో తీర్పు ఇవ్వడం అందరికీ తెలిసిన విషయమే. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం డాలర్ల కుంభకోణంలో శేషాద్రికి ఏలాంటి పాత్ర లేదని, కేసుకు అతనికి ఏలాంటి సంభందంలేదని ఊరట కల్పిస్తూ అధికారికంగా జి.వో విడుదల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
 
డాలర్ శేషాద్రి తితిదే ఉద్యోగిగా పదవీ విరమణ పొంది సంవత్సరాలు గడుస్తున్న నేటికి కూడా తనే స్థాయి టీటీడీలో ఇసుమంత కూడా తగ్గలేదు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో మొదలుకొని ప్రముఖ సినీతారలు, బడా పారిశ్రామికవేత్తలు, సంపన్నులు వాళ్లు వీళ్లు అని కాదు ప్రతిఒక్కరితో శేషాద్రికి సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు తిరుమలకు వచ్చిన సమయాలలో డాలర్ వారి ప్రక్కనే ఉండి సేవలు చేస్తుంటాడు. ఈ క్రమంలో 2004 - 2006 మధ్యకాలంలో 300 బంగారు డాలర్లు గల్లంతయ్యాయి. టీటీడీ చరిత్రలో భారీ కుంభకోణంగా డాలర్ల కేసు అప్పట్లో పెద్ద దుమారమైంది. టీటీడీ విజిలెన్స్, పోలీసు శాఖలతో పాటు సి.బి.సి.ఐ.డి అధికారులు కూడా కేసును లోతుగా దర్యాప్తు చేశాయి. 
 
తొలుత తిరుమల ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వెంకటాచలంను సస్పెండ్ చేశారు. అనంతరం అప్పటి టీటీడీ ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి రమణకుమార్ నివేదిక ఆధారంగా ఆలయ డిప్యూటీ ఈవో రెడ్డివారి ప్రభాకరరెడ్డి, ఆలయ పేష్కార్ వాసుదేవన్, ఆలయ బొక్కసం ఇన్‌చార్జిగా పనిచేసి ఉద్యోగ విరమణ తర్వాత కాంట్రాక్టు పద్ధతిలో ఆలయ ఓఎస్‌డీగా కొనసాగిన డాలర్ శేషాద్రిపై కూడా ఆరోపణలు వచ్చాయి. 
 
దీంతో ఆ ముగ్గురిపై అప్పటీ ఈవో కేవీ. రమణాచారి వేటు వేశారు. ఈఓ నిర్ణయాని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ అప్పట్లో టీటీడీ ఉద్యోగ సంఘాలు ఆందోళనలకు దిగాయి. దీంతో ఆ ముగ్గురిపై సస్పెన్షన్ తొలగిస్తూ అప్పటి టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించడంతో సమస్య తాత్కాలికంగా సమసిపోయింది. తర్వాత డెప్యూటీ ఈవో ప్రభాకరరెడ్డి, పేష్కార్ వాసుదేవన్ ఉద్యోగ విరమణ పొందారు. 
 
కాంట్రాక్టు పద్ధతిలో ఆలయ ఓఎస్‌డీగా డాలర్ శేషాద్రి మాత్రం నేటికి కొనసాగుతునే ఉన్నారు. 2006వ సంవత్సరంలో వెలుగుచూసిన డాలర్ల కుంభకోణంకు సంభందించి పలు విచారణలు, దర్యాప్తుల అనంతరం 2014లో రాష్ట్ర హైకోర్టు తుదితీర్పు ప్రకటించడం జరిగింది. కేసుకు సంబంధించి టీటీడీ సీనియర్ అసిస్టెంట్ వెంకటాచలపతికి మూడేళ్ల జైలుతో పాటు జరిమానా విధించింది. అలాగే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డాలర్ శేషాద్రితో పాటు మరికొందరు అధికారులు నిర్దోషులుగా బయటపడ్డారు. ఇక్కడి దాకా అంతాబాగానే ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుంభకోణంకు సంబంధించి తాజాగా జీవోలు విడుదల చేయడం పలు చర్చలకు తావిచ్చినట్లైంది.
 
డాలర్ శేషాద్రిని హైకోర్టే నిర్దోషి అని తీర్పు ప్రకటించిన తరువాత మరలా రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణానికి శేషాద్రికి ఏలాంటి సంబంధం లేదు, అతని నిజాయితీగల నిర్దోషంటూ జీ.వోలు విడుదల చేసి మరి ముద్ర వేయాల్సిన అవసరమేంటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే తన తుదిశ్వాస వరకు కూడా శ్రీవారికి నిస్వార్థంగా సేవ చేస్తుంటానని, కోర్టు తీర్పుకు అనుగుణంగా తనపై నమ్మకంతో అధికారికంగా జీవో విడుదల చేసి పూర్తి ఊరట కల్పించడం పట్ల శేషాద్రి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 
 
మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఈ బంగారు డాలర్ల కుంభకోణం ఓ మాయని మచ్చలా మిగిలిపోయిందనేది అక్షరసత్యం. ఇదంతా బాగానే ఉన్నా డాలర్ శేషాద్రి వ్యవహారాన్ని దగ్గరగా ఉన్న కొంతమంది భక్తులు దీన్ని ఏ మాత్రం నమ్మడం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక గ్లాసు నీళ్ళలో ఆ ఒక్కటి వేస్తే మీరు కోటీశ్వరులే...!