Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బాబాను నిద్రపుచ్చే భాగ్యం కలిగింది

Advertiesment
బాబాను నిద్రపుచ్చే భాగ్యం కలిగింది
, శనివారం, 27 ఆగస్టు 2022 (21:46 IST)
షిరిడీ యాత్ర. ఇదే తొలిసారి. విజయవాడ స్టేషనులో రైలు ఎక్కేముందు ఎలా సాగుతుందో అనిపించింది. నేను ఎక్కిన బోగీలో అంతా శ్రీ భరద్వాజ్ మాస్టారు సత్సంగం సాయి భక్తులని మా అమ్మ చెప్పింది. మేము రైలు ఎక్కినప్పటి నుంచి... అంటే జూన్ 23 మధ్యాహ్నం నుంచి జూన్ 24న షిరిడీలో అడుగుపెట్టేవరకూ అంతా కాలం తెలియకుండా జరిగిపోయినట్లనిపించింది.


సహజంగా ఎక్కువగా నేను అమ్మా-నాన్న-చెల్లెలు-తమ్ముడు వీరితోనే మాట్లాడుతుంటాను. ఐతే తొలిసారిగా శ్రీభరధ్వాజ్ గారి సత్సంగ సాయి భక్తులు ఒక్కొక్కరు మా వద్దకు వచ్చి పలుకరించి వెళ్తున్నారు. సాయి సేవకులుగా నాతోటి వయసు పిల్లలు, ఇంకా చిన్నవారు కూడా రైలు బోగీలో వున్నవాళ్లందరి భోజన సదుపాయాలను శ్రద్ధగా చేస్తుండటం గమనించాను. అన్నిటికీ మించి జయసుధ ఆంటీ మాకు కావలసిన తినుబండారాలను తెచ్చి ఇచ్చారు. నిజానికి ఈ ప్రయాణంలో ఆకలి అనేది గుర్తులేకుండా చేసారు. అలా మాట్లాడుతూండగానే రాత్రయ్యింది. భోజనం ముగించి నిద్రకు ఉపక్రమించాను. 

 
తెలవారుతుండగా నిద్రలేచి రైలు కిటికీ నుంచి బయటకు చూసాను. అంతా పచ్చదనంతో అలరారుతోంది. కొత్తగా అనిపించింది. ఇంతలో నాగసోల్ స్టేషను వచ్చిందన్నారు. స్టేషనులో దిగి బయటకు రాగానే మాతోపాటు వచ్చిన వందలాది భక్తులు కలిసారు. గురువుగారి సూచనల మేరకు 10 మంది కలిసి ఒక్కో వ్యానులో ఎక్కి షిరిడీకి బయలుదేరాము. దారిపొడవునా పచ్చదనంతో పలుకరిస్తున్న అందాలను తిలకించడం నయనానందకరంగా అనిపించింది. అలా చూస్తుండగానే షిరిడీ పుణ్యక్షేత్రానికి చేరుకున్నాము. మేము బస చేయాల్సిన వసతి గృహానికి చేరుకున్నాము. త్వరత్వరగా స్నానాదికాలు ముగించుకున్నాము. ఇంతలో సత్సంగ సభ్యురాలైన ఆంటీగారు శ్రీ భరధ్వాజ మాస్టారు గారి ట్రస్టుకి వెళ్దామని చెప్పారు. అంతా కలిసి సత్సంగ మందిరానికి చేరుకున్నాము.

 
అక్కడ గురువుగారు సాయినాధుడు తిరిగిన మహిమాన్వితమైన నేల గురించి, షిరిడీ విశిష్టితను వివరిస్తున్నారు. అలమేలు మంగమ్మ సమేత భరద్వాజ్ మాస్టారుగారి ఫోటో ఓవైపు, సాయినాధుని ఫోటో మరోవైపు వున్నాయి. నమస్కరించి ఆ ప్రాంగణంలో కూర్చున్నాను. శ్రీ భరద్వాజ్ మాస్టారుగారి అనుభూతులు, సాయినాధుని మహిమలు వివరించారు. జైసాయి మాస్టర్ అంటూ గురువుగారు తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం ఉదయం అల్పాహారం తీసుకోవాలని గురువుగారు చెప్పడంతో అంతా కలిసి అల్పాహారం తీసుకున్నాము.

 
ఆ తర్వాత తిరిగి వసతి గృహానికి వెళ్లాము. సాయంత్రమయ్యింది. మా అమ్మవాళ్లంతా షిరిడి సాయినాధుని దర్శనం కోసం బయలుదేరుతున్నాను. నేను కూడా సిద్ధమవుతున్నాను. ఇంతలో నేను ఇంటర్య్వూ చేసిన బ్యాంకు హెచ్ఆర్ విభాగం నుంచి ఫోను వచ్చింది. మరికొద్దిసేపట్లో మీతో ఫోన్ ఇంటర్వ్యూ వుంటుందని చెప్పారు. దాంతో దర్శనానికి వెళ్లాల్సిన నేను వసతి గృహంలోనే ఆగిపోయాను. సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడారు. పంపాల్సిన డాక్యుమెంట్లు, జాయిన్ అవ్వాల్సిన తేదీని వివరించారు. నా జీవితంలో ఇదే మొదటి ఉద్యోగం. ఇక్కడే నిర్ణయం జరిగినందుకు ఆ బాబా, భరద్వాజ్ మాస్టారు గారికి నమస్కరించుకున్నాను.

 
మరుసటిరోజు ఉదయం సత్సంగ మందిరంలో పారాయణం జరిగింది. 11 గంటల ప్రాంతంలో గురువుగారితో కలిసి సత్సంగ భక్తులంతా షిరిడి సాయినాధుని దర్శనానికి వెళ్లాము. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా వుంది. క్యూలైన్లలో శ్రీ భరద్వాజ్ మాస్టారు, షిరిడీ సాయినాధుని స్మరణలతో ముందుకు కదిలాము. షిరిడీ సాయినాధుని దర్శనంకోసం భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అలా శిరిడీ నామస్మరణ చేస్తూ తొలిసారి ఆ సాయినాధుని దర్శించుకున్నాను. బయటకు వచ్చాను కానీ... మరోసారి ఆ సాయిదర్శనం కలిగితే బాగుండు అనుకున్నాను. ఆ తర్వాత మ్యూజియం, ద్వారకామాయి తదితర ప్రాంతాలను దర్శించుకున్నాము. సాయంత్రానికి తిరిగి ఇంటికి చేరుకున్నాము.

 
26వ తేదీ అంతా కలిసి చుట్టుపక్కల సమీపంలో వున్న దేవాలయాలను సందర్శించేందుకు బయలుదేరాము. పంచముఖ గణపతి, సాకోరి బాబా, ఉపాసిని బాబా, వీరభద్రస్వామి, ఏకముఖి దత్తాత్రేయుడు తదితర పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాము. ఆ దేవాలయాల సందర్శనానికి వెళ్లినప్పుడు చుట్టుపక్కల పచ్చదనం, దూరదూరంగా విసిరేసినట్లున్న గృహాలు ఆహ్లాదంగా అనిపించాయి. అలా దేవాలయాల సందర్శన ముగించుకుని శ్రీ భరద్వాజ్ మాస్టారు గారి ట్రస్టుకి చేరుకున్నాము. అక్కడ మాకు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేసారు. రేయింబవళ్లు మాకోసం వారు శ్రమిస్తున్న తీరు చూసి వారికి ఆ సాయినాధుడు మరింత శక్తినివ్వాలని, ఎంతోమంది భక్తులకు సేవచేసే భాగ్యం కలగాలని కోరుకున్నాను. సాయంత్రం మా నాన్న, చెల్లెలు, తమ్ముడితో కలిసి దేవాలయ ప్రాంగణంలో షాపింగుకి బయలుదేరాము. రాత్రి 9.30 గంటలైంది.

 
ఇంతలో మా అమ్మ ఫోన్ చేసింది. తన ఫోన్ మాకు ఇచ్చి దర్శనానికి వెళ్లాలని చెప్పింది. దాంతో మేమంతా కలిసి గుడి ప్రాంగణానికి చేరుకున్నాము. అక్కడికి వెళ్లగానే అమ్మతో పాటు వచ్చిన మిగిలివారంతా మమ్మల్ని కూడా దర్శనానికి రమ్మని అడిగారు. షాపింగ్ చేసిన వస్తువులు, పాదరక్షలు, ఫోన్లు ఏం చేయాలి? ఇంతలో మానస, రజినీగారి భర్తగారు మావద్దకు వచ్చి మా వస్తువులు, ఫోన్లు తీసుకుని మమ్మల్ని దర్శనానికి వెళ్లమన్నారు. మరో ఐదు నిమిషాల్లో క్యూలైన్ క్లోజ్ చేస్తారని అంటుండగా అందరం పరుగుపరుగున క్యూలైన్లోకి వెళ్లాము. తోటి భక్తులు చెప్పేదాని ప్రకారం మేము వెళ్లేలోపుగా సాయినాధుడి రాత్రి శేజ్ హారతి పూర్తయిపోతుందనీ, సాయినాధుని దర్శనం కష్టతరమని అంటున్నారు. ఐనా నమ్మకంతో ముందుకు కదిలాము.

 
సాయినాధునికి సమీపంలోకి చేరేసరికి భక్తులందరినీ ఆపేసారు. దాంతో అక్కడ మరోసారి రద్దీగా మారింది. పదినిమిషాల పాటు అలా నిలబడ్డాము. ఇంతలో గేటు తెరిచారు. బిలబిలమంటూ భక్తులందరూ ఎవరికి తోచినట్లు వారు పరుగులుపెట్టారు. నాతోబాటు ఆంటీగారు వున్నారు. ఇద్దరం చేయిచేయి కలిపి ముందుకు వెళ్లాం. మెరుపు వేగంతో ఏకంగా శ్రీ షిరిడీ సాయినాధుని నేరుగా చూసేందుకు వీలుగా ఎదురుగా ముందు లైన్లోకి వచ్చేసాము. నిజానికి మా ఇంట్లో నేనే చాలా నిదానస్తురాల్ని అంటుంటారు. అంటే... నడవడంలో కావచ్చు, పరుగు తీయడంలో కావచ్చు. ఐతే ఇక్కడ శ్రీసాయిబాబా దర్శనానికి అత్యంత వేగంతో ముందుకు వచ్చి కూర్చున్నాను.

 
ఆ తర్వాత మా కుటుంబ సభ్యులు, ఇతర సాయి భక్తులు ఎక్కడ వున్నారా అని చూస్తే అంతా నాలుగైదు వరుసలకు ఆవల వున్నారు. అందరికీ బాబాను నేరుగా వీక్షించే భాగ్యం కలిగినందుకు సంతోషం వేసింది. ఇంతలో హారతి ప్రారంభమైంది. సాయినాధుని భజన చేస్తూ మరొక్కసారి తరించాము. హారతి అయిపోగానే తలుపులు వేసేసారు. సాయినాధుడు నిద్రపోయారు మీరికి వెళ్లవచ్చన్నారు అక్కడి సిబ్బంది. దాంతో సాయినాధుని నిద్రపుచ్చే భాగ్యం కలిగినందుకు సంబరబడ్డాను. ముందటిరోజు సాయినాధుని దర్శనం మరొక్కసారి కలిగితే బాగుండు అనుకున్నందుకు మళ్లీ సాయిదర్శనం అనుకోకుండా కలిగినందుకు ఆనందం కలిగింది. అలా శ్రీసాయి నాధుని దర్శనభాగ్యంతో తిరుగుప్రయాణమయ్యాము.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రావణమాసంలో శనైశ్చర అమావాస్య.. శనికి ఇవి దానం చేస్తే..