జూలై 23న మాస శివరాత్రి. దీన్ని పెద్దగా పట్టించుకోరు చాలామంది. అయితే ఈసారి ఆరుద్ర నక్షత్రం మాసశివరాత్రికి తోడవడంతో ఈ రోజున శివారాధనతో విశేష ఫలితాలను పొందవచ్చు. ఆ రోజు సాయంత్రం పూట శివాలయాల్లో దీపం వెలిగించడం ద్వారా అడ్డంకులు తొలగి కార్య విజయం చేకూరుతుంది. ఈతిబాధలు తీరిపోతాయి. ఆరుద్ర నక్షత్రం శివుని జన్మ నక్షత్రం కావడంతో నటరాజ స్వామిని ఈ రోజున పూజించడం విశేషం.
ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే చతుర్థశిని మాస శివరాత్రి అంటారు. గ్రహదోషాల నుంచి విముక్తి పొందడానికి మహా శివరాత్రి రోజునే శివునిని పూజించేందుకు వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రతి మాసంలో వచ్చే శివరాత్రి రోజున పూజించినా మంచి ఫలితాలు వుంటాయంటున్నారు ఆధ్యాత్మిక పండితులు.
మాస శివరాత్రి రోజున శివుడిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున శివునికి చెరకు రసం, పంచామృతాలు, పాలు, తేనె, పెరుగుతో అభిషేకం జరిపించాలి. శివ అష్టోత్తరంతో శివునిని పూజించాలి. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త పువ్వులు, భస్మం సమర్పిచాలి.
ఇంకా ఎండుద్రాక్ష, కొబ్బరి కాయలు నైవేద్యంగా పెట్టాలి. మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన ఈ రోజున శివతాండవం, శివాష్టకం, అర్ధనారీశ్వర స్తోత్రం వంటివి పఠిస్తే మంచిది. అన్నదానం, వస్త్ర దానం వంటివి చేస్తే విశేషమైన ఫలితాలను పొందవచ్చు.