మార్గశిర శుద్ధ పంచమి రోజున వివాహ పంచమిగా పిలుస్తారు. ఈ ఏడాది నవంబర్ 25, మంగళవారం వస్తోంది. ఈ రోజు సాయంత్రం, రాత్రి వారాహి పూజను చేయడం విశిష్ట ఫలితాలుంటాయి. వివాహం ఆలస్యం అవుతున్నవారు, పెళ్లి విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు వివాహ పంచమి రోజు ఒక ప్రత్యేకమైన పూజ జరపడం ద్వారా వివాహంలో ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్యశాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ రోజున సీతా దేవి, శ్రీరాముల కల్యాణం జరిగినదనే విశ్వాసం.
అంతేకాదు వివాహం అయిన దంపతులు వివాహ పంచమి పూజ చేయడం వలన అన్యోన్య దాంపత్యం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. సాయంత్రం పూట ఆవునేతితో దీపారాధన చేయాలి. పసుపు రంగు పూలతో అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజించాలి. పులిహోర, పాయసం, గారెలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజు చాలా ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిపిస్తారు.
ముఖ్యంగా వివాహం విషయంలో సమస్యలు ఉన్నవారు సీతారాముల కల్యాణోత్సవం జరిపించడం అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. వివాహంలో ఆలస్యం అవుతే, వివాహ పంచమి రోజున సత్తు లేదా నల్ల నువ్వులను దానం చేయడం చాలా మంచిదంట. దీని వలన శని దోషం తొలిగిపోయి, వివాహ అవకాశాలను వేగవంతం చేస్తారంట. అందుకే వివాహం అవ్వడంలో అడ్డంకులు ఎదురైతే, వారు నల్లనువ్వులు దానం చేయడం చాలా మంచిదట.