Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వరలక్ష్మీ వ్రతం: పుష్పాలు.. నైవేద్యాల సంగతి..

Advertiesment
వరలక్ష్మీ వ్రతం: పుష్పాలు.. నైవేద్యాల సంగతి..
, గురువారం, 19 ఆగస్టు 2021 (19:00 IST)
వరలక్ష్మీ వ్రతం నాడు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడానికి మల్లెలు, సంపెంగలు, మొగలి పువ్వులు, కలువ పువ్వులు వంటి రకరకాల పువ్వులను ఉపయోగించవచ్చు. వరలక్ష్మీ వ్రతం నాడు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి తొమ్మిది రకాల పిండివంటలు చేయాలని పెద్దలు చెప్తారు. 
 
ముఖ్యంగా చాలా మంది అమ్మవారికి పూర్ణాలు, గారెలు, బూరెలు, పరమాన్నం, పులిహోర, బొబ్బట్లు, చలిమిడి, వడపప్పు, శనగలు నైవేద్యంగా నివేదిస్తారు. తొమ్మిది రకాల వంటలు చేయలేని వాళ్ళు తమకు చేతనైనన్ని చేసుకోవచ్చని కూడా పెద్దలు చెప్తారు. అయితే అత్యంత భక్తి భావనతో అమ్మవారిని పూజించడమే ప్రధానమని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
చక్కగా మండపాన్ని సిద్ధం చేసుకున్న తరువాత, తొమ్మిది రకాల పిండివంటలను సిద్ధం చేసి వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రారంభించటానికి ముందు వరలక్ష్మీ దేవిని చక్కగా పువ్వులు ఆభరణాలతో అలంకరించి ఆ తల్లిని ఆవాహన చేయాలి. అమ్మవారు ఇంట్లోనే కూర్చున్నారా అన్నట్టు మహిళలు చక్కగా అమ్మవారిని అలంకరించి ఆవాహనం చేస్తారు. 
 
వరలక్ష్మి అమ్మవారిని కీర్తిస్తూ అష్టోత్తర శత నామాలతో అర్చన చేయాలి. అమ్మవారికి ధూపదీపాలు నైవేద్యాలను సమర్పించి, వరలక్ష్మీ వ్రత కథను చదివి ఆ తల్లి మహత్యాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. అమ్మవారి పూజలో అష్టోత్తర శతనామావళికి ఒక విశిష్టత ఉంది. వరలక్ష్మీదేవి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కథ ఉందని పురాణాలు చెబుతున్నాయి. 
 
ముత్తయిదువుల ఆశీర్వాదంతో ముగింపు .. వరలక్ష్మీ వ్రతం చేస్తే కలిగే ఫలితాలివే ఇక శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారో వారంతా సాయంత్రం ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలిచి కాళ్ళకు పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి వారికి పండు, తాంబూలాన్ని ఇచ్చి వారి దగ్గర నిండు నూరేళ్లు పసుపుకుంకుమలతో చల్లగా జీవించమని ఆశీర్వాదం పొందుతారు. 
 
ఈ విధంగా చేసిన వారికి సకల శుభాలు కలుగుతాయని మహిళలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అంతేకాదు శ్రావణ మాసంలో వరలక్ష్మీ వ్రతం చేసుకునే వారికి అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు కూడా కలుగుతాయని చెప్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరలక్ష్మీదేవి వ్రతంతో సకల శుభాలు.. ఆయురారోగ్యాలు మీ వశం