ప్రదోష సమయంలో శివాలయాలలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు సిద్ధిస్తాయని భావిస్తారు. ఈ సమయంలో శివుడితో పాటు నందీశ్వరుడిని కూడా ఆరాధిస్తారు.
నందీశ్వరుడు నాలుగు వేదాలు, 64 కళలను అభ్యసించిన నిష్ణాతుడైనప్పటికీ, వినయంతో వుండి, శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నివృత్తి చేస్తాడని విశ్వసిస్తారు.
త్రయోదశి రోజున సాయంతం 4:30 నుండి 6:00 గంటలవరకు ప్రదోషకాలం ఉంటుంది. ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడిని పూజించినట్లయితే ఎటువంటి పాపాలైనా దహించుకుపోతాయి.
ఇంకా ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఎడమ భాగంలో పార్వతి కుడి భాగాన పరమేశ్వర రూపంగా 'అర్థనారీశ్వరుడిగా' దర్శనం ఇచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడింది. పరమశివుడు సదా ప్రదోషకాలంలో నాట్యం చేస్తూ ఉంటాడు.
పరమేశ్వరుడు అర్థనారీశ్వరుడిగా దర్శనం ఇవ్వడం ద్వారా ఒకే శరీరంలో రెండు రూపాలను ప్రదర్శిస్తున్నాడు. ప్రదోషకాలంలో ఉమామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.
అలాగే ప్రదోషకాలంలో శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయుష్మంతులు అవుతారు.
ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవునేయ్యితో అభిషేకం చేస్తే మోక్షం లభిస్తుంది. మంచి గంధంతో అభిషేకం చేసినట్లయితే శ్రీమహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.