ఆదివారం సంకష్టహర చతుర్థి. ఆ రోజున వినాయకుడిని ఆరాధించే వారికి సకలసంపదలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఒత్తిడితో కూడిన జీవితం, మనశ్శాంతిని పొందాలంటే.. సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. సంకష్టహరచతుర్థి రోజున సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం వుండాలి. సాయంత్రం చంద్ర దర్శనం తర్వాత ఉపవాసం విరమించాలి.
చతుర్థి రోజున చంద్రుడిని చూసిన తరువాత ఉపవాసం ఆపడమే ఆనవాయితీ. చంద్ర దర్శనం పూర్తయ్యాక.. గణేశుడిని పువ్వులతో ఆరాధించాలి. మోదకాలను సమర్పించాలి. సంకష్ట చతుర్థి పూజలు, స్తోత్రాల తర్వాత ఉపవాసాన్ని విరమిస్తూ భోజనం తీసుకోవాలి.
వ్రతాచరణ రోజున ప్రాతఃకాలమే శిరస్సున స్నానం చేసి, తరువాత గణపతిని పూజించాలి. అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు, కుంకుమలతో అలంకరణను చేయాలి.
మనస్సులోని కోరికను తలచుకొని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి.
సంకటనాశన గణేశ స్తోత్రం, సంకట హర చతుర్థి వ్రత కథను చదవవలెను. ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి. తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి 3 లేక 11 లేక 21 ప్రదక్షిణాలు చేయాలి. శక్త్యానుసారము గరిక పూజను కాని, గణపతి హోమమును కాని చేయించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.