శ్రీ రామునికి పట్టాభిషేకం అయిన తర్వాత ప్రతి నిత్యమూ హనుమ ప్రార్థన సీతామాతకు మేలుకొలుపు అయిపోయింది. పట్టాభిషేకానికి వచ్చినవారంతా వారి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. కానీ హనుమను రాముడు తన వద్దే వుండిపొమ్మన్నాడు. రామ పాదాలు విడిచిరాడు కాబట్టి సుగ్రీవుడు తనతో రమ్మనలేదు కనుక హనుమ అయోధ్యలోనే ఉండిపోయాడు.
రాముడు అంతఃపురంలో నుంచి బయటికి వచ్చే సరికి ద్వారం బయట నిలిచి వుంటారు హనుమ. రాముడు పిలవనవసరం లేకుండానే అతని వెంట రాజసభకి వెళుతాడు. రాముడు సింహాసనాధీశుడైతే అతని వెనక నిలబడతాడు. రథం ఆగిన మరుక్షణం క్రిందకి దూకి రాముడు క్రిందికి దిగడానికి వీలుగా తన అరచేతులను మెట్లుగా ఉపయోగిస్తాడు.
రాత్రికి రాముడు అంతఃపురంలోకి ప్రవేశించగానే ద్వారబంధనాలను మూసివేస్తాడు. హనుమ ద్వారం బైటనే రామనామం పలుకుతూ ఆగిపోతాడు. మళ్ళీ బ్రహ్మీ ముహూర్త సమయంలో హనుమ ప్రార్ధనతోటే రాముని అంతఃపురం మేలుకొంటుంది. అయోధ్యానగరం మేలుకొంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రామరాజ్యం మేలుకొంటుంది.
ఇలా హనుమను చూసేసరికి సీతమ్మకు జాలి కలిగింది. ఓ రాత్రి .. .మనకోసం ఇన్నిచేసిన హనుమకు మనం చూపే కృతజ్ఞత ఇదేనా అని రాముడిని నిలదీసింది. "తన హృదయంలో నేనూ-నా హృదయములో అతను ....నాలోనే ఉంటూ నన్ను నడిపించేవాడికి కృతజ్ఞత ఎలా చూపించను" అన్నాడు. "చాల్లేండి మీ రాచరికపు మాటలు .. హనుమ సరిగ్గా తింటున్నాడో లేదో ..ఈ రోజు హనుమను నేనే భోజనానికి పిలుస్తాను .. స్వయంగా వండి వడ్డించి దగ్గర కుర్చుని తినిపిస్తాను "అంది సీతమ్మ. పిలిస్తే నీకే అర్థమవుతుందని శ్రీరాముడు అన్నాడు.
అన్న ప్రకారమే సీతమ్మ అన్నీ సిద్దంచేసి హనుమకు వడ్డిస్తూ ఉంది దగ్గర కూర్చుని.. తిను నాయనా మొహమాటపడకు అంటుంటే... "సరేనమ్మా అంటూ హనుమ తలవంచుకుని భోజనం చేయసాగాడు. సీతమ్మ కొసరి కొసరి వడ్డిస్తుంటే హనుమ వద్దు అనకుండా తింటున్నాడు. కొంతసేపటికి పదార్థాలన్నీ ఐపోయాయి. సీతమ్మ కంగారుపడి అంతఃపుర వాసుల కోసం వండిన పదార్దాలు కూడా తెప్పించింది...అవీ ఐపోయాయి ...తలవంచుకునే ఆహారం కోసం నిరీక్షిస్తున్నాడు హనుమ ఆవురావురుమంటూ ....సీతమ్మకు కంగారు పుట్టి "రోజూ ఏమి తింటున్నావు నాయనా"అని అడిగింది విస్మయంగా.
రామ నామం తల్లీ అంటూ వంచిన తలెత్తకుండా జవాబిచ్చాడు హనుమ. సీతమ్మ తుళ్ళిపడి నిరంతరం రామనామం భుజించేవాడూ, భజించేవాడూ, శివుడొక్కడేకదా. సీతమ్మ తేరిపార చూసింది. అప్పుడు సీతమ్మకు హనుమలో శంకరుడు కనిపించాడు.
శంకరుడే హనుమ... నిత్యం రామ నామ ఆహారంగా స్వీకరించేవాడికి తను ఇంక ఏమిపెట్టగలదు? అని సీతమ్మ తెలుసుకుని .. ఒక్క అన్నపు ముద్దను పట్టుకుని రామార్పణం అని ప్రార్దించి వడ్డించింది. ఆ ముద్దను భక్తితో కళ్ళకు అద్దుకుని తిని కడుపు నిండిందమ్మా .. అన్నదాతా సుఖీభవ అన్నాడు హనుమ. అలా హనుమలోని పరమేశ్వరుడికి భక్తితో నమస్కరించింది సీత.