మహాభారతం ప్రకారం అంపశయ్య మీద ఉన్న భీష్ముడు పాండవులకు విష్ణు సహస్రనామాన్ని బోధించిన రోజు ఈ భీష్మ ఏకాదశి. మహావిష్ణువునకు ప్రీతిపాత్రమైన తిథులలో ‘ఏకాదశి’ ముఖ్యమైనది. దీనినే ‘హరివాసరము’ అని కూడా అంటారు. ఏకాదశి తిథిన భక్తజనులు ఉపవాసము చేస్తారు. భగవన్నామ స్మరణ, జప, పారాయణలతో భగవానుని సమీపమున (ఉప) మనస్సును ఉంచుటయే(వాసము) ఉపవాసం చేస్తారు.
అందుకే ఈ రోజున విష్ణు సహస్ర నామాన్ని పఠించి.. భీష్మాచార్యుల అనుగ్రహంతో పాటు శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెప్తున్నాయి. అలాంటి భీష్మ ఏకాదశి రోజున పితృదేవతలు అర్ఘ్యం సమర్పించడం ద్వారా పుణ్యఫలాలను పొందవచ్చు.
సత్యవతి తండ్రి దాశరాజుకు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞచేసినందున తాను యావజ్జీవము బ్రహ్మచర్య వ్రతము పాటించి గాంగేయుడు భీష్ముడుగా ప్రసిద్ధికెక్కాడు. అలాంటి మహిమాన్వితుడు.. అంపశయ్యపై వుంటూ విష్ణుసహస్ర నామాన్ని బోధించాడు. భీష్మ నిర్యాణం జరిగి సహస్రాబ్దాలు గతిస్తున్నా ఆయన ప్రవచించిన ''విష్ణు సహస్రనామస్తోత్రం'' ఇప్పటికీ భాగవతుల రసాగ్రాలపై నర్తిస్తూనే వుంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే వుంది. విష్ణుసహస్రనామ పఠనం సర్వదుఃఖహరణం, సకల శుభకరణం.
ఆ నామావళిలోని ప్రతీ అక్షరము దైవస్వరూపమే. ప్రతీ నామమూ మహామంత్రమే. మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు పరమపథం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మఏకాదశిగాను జరుపుకుంటారు.
తల్లిదండ్రులు వున్నా భీష్మునికి తర్పణాలు యిస్తే బహుపుణ్యప్రదమని, అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్ర ప్రమాణం. అంతేకాదు ''సంతానం లేని దంపతులు "భీష్మాష్టమినాడు'' కానీ "భీష్మఏకాదశి'' నాడు గానీ, భీష్మునికి శ్రాద్ధము పెడితే వారికి సత్‌సంతానం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి.
అలాగే విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశినాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలూ హరిస్తాయి.
పుణ్యగతులు లభిస్తాయి. అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్రదోషాలు ఉన్నవారుకూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు అన్నింటి నుంచి విముక్తిపొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారు.