శనివారం ఆంజనేయ పూజ చేయడం శని బాధల నుంచి గట్టెక్కిస్తుంది. ఆంజనేయుడు నవగ్రహ దోషాలను తొలగిస్తాడు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని దశలు జరుగుతున్న వారు, శనివారం ఆంజనేయుని ఇష్టమైన వాటితో పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. తమలపాకులు, సింధూరం, అరటిపండ్లు, వడమాల సమర్పించినట్లైతే సకల శనిదోషాలు తొలగిపోతాయి.
ఆంజనేయుని పూజలో సింధూర పూజ ప్రధానమైనది. స్వచ్ఛమైన సింధూరంలో కొంచెం నువ్వుల నూనె కలిపి ఆంజనేయుని విగ్రహానికి గాని, చిత్రపటానికి అలంకరించినట్లైతే హనుమంతుని పరిపూర్ణ అనుగ్రహంతో దుష్ట గ్రహ పీడలు, శత్రు బాధలు దూరమవుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఆంజనేయునికి అరటిపండ్లు సమర్పిస్తే హనుమ అనుగ్రహంతో పాటు ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం కూడా పరిపూర్ణంగా పొందవచ్చునని పురాణాలు చెబుతున్నాయి.
క్లిష్ట సమయాల్లో అసాధ్యం అనుకున్న కార్యం సాధ్యం చేసుకోవాలంటే "అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వధ రామదూతం కృపాసింధుమ్ మత్కార్యం సాధయ ప్రభో.." అనే శ్లోకాన్ని ప్రతి శనివారం చదువుకుంటే ఎంతటి క్లిష్ట కార్యమైనా హనుమ అనుగ్రహంతో సులభంగా పూర్తి అవుతుందని పురాణాలు చెప్తున్నాయి.