గోరింటాకు చిగురిస్తోంది. కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు ఎప్పుడెప్పుడు పుట్టింటికి పోదామా అని ఆలోచిస్తున్నారు. బోనాల పండుగకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఇవన్నీ చూస్తే గుర్తొచ్చింది.. ఆషాఢమాసం వచ్చేసిందని.
ఈ నెల 10 నుంచి నెల రోజుల పాటు ఆషాఢమాసం. ఈ మాసంలోనే తెలంగాణవ్యాప్తంగా బోనాల పండుగను జరుపుకుంటారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, నృత్యాలతో శ్రావణం దాకా సంబురాలు జరుపుకుంటారు.
కొత్త కోడలు ఈ నెలలో అత్తగారింట్ల ఉండకుండా పుట్టింటికి పోవడం సంప్రదాయం. ఆడవాళ్లు అరచేతిలో గోరింటాకు పెట్టుకుని చూసుకుని మురిసిపోతారు.
శనివారం నుంచి మొదలైన ఆషాఢం వచ్చేనెల ఆగస్టు 8 తో ముగుస్తుంది. ఈ మాసంలో బోనాలు, ఒడిశాలో జగన్నాథుని రథయాత్ర కూడా ఆషాఢమాసంలోనే జరుగుతుంది. ఈ నెల 20న తొలి ఏకాదశి పండుగతో పండుగలు మొదలవుతాయి.
వ్యాస పూర్ణిమ, సంకట హర చతుర్థి, చుక్కల అమావాస్య కూడా ఈ నెలలోనే జరుపుకుంటారు. గ్రామాల్లోని ఇళ్లన్నీ బంధువుల రాకతో, ఇంటి పరిసరాలన్నీ పచ్చని మామిడి తోరణాలతో కళకళలాడుతయ్. ఇక గ్రామ దేవత విగ్రహ ప్రతిష్ఠలు జరుగుతాయి.
వర్షాలు బాగా కురవాలని, పంటలు మంచిగా పండాలని ఆరోగ్యంగా ఉండాలని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేస్తారు.