మరకత లింగం వెలసిన పుణ్యక్షేత్రాన్ని సోమవారం పూట పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ముఖ్యంగా కన్యారాశి వారు మరకత లింగాన్ని పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి. కన్యారాశికి బుధవారం కలిసివస్తుంది. అలాగే ఆ రాశికి బుధుడు అధిపతి. అందుచేత బుధవారాల్లో ఏ కార్యాన్ని ప్రారంభించినా మంచే జరుగుతుంది. అలాగే మరకత మణి ఈ రాశివారికి అద్భుత, విశేష ఫలితాలను ఇస్తుంది.
జాతిపచ్చ ఈ రాశి వారు ధరించడం ద్వారా శుభాలు చేకూరుతాయి. అలాగే మరకతం అనే పచ్చతో కూడిన శివుని లింగాన్ని దర్శించుకుంటే ఇక జీవితంలో ఈతిబాధలంటూ వుండవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అలాకాకుంటే మరకత రాయితో లింగాన్ని తయారు చేయించి.. ఆ లింగానికి ఇంట్లోనే పూజ చేయవచ్చు. మరకత లింగాన్ని ఇంద్రుడు పూజించినట్లు పురాణాలు చెప్తున్నాయి.
ఈ లింగాన్ని పూజించడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు తొలగిపోతాయి. ఓ గాజు పాత్రలో పాలను పోసి అందులో మరకత లింగాన్ని వుంచి పాలు మొత్తం పచ్చ రంగు వచ్చేంత వరకు వుంచాలి. పాలలో మరకత లింగాన్ని వుంచితే అది పూర్తిగా పచ్చ రంగుకు మారిపోతుంది. ఇదే స్వచ్ఛమైన మరకత లింగమని గ్రహించవచ్చు. నీటిలో మరకత లింగాన్ని వుంచినా నీరు పచ్చ రంగులో మారిపోతుంది.
ఈ లింగాన్ని పూజించడం ద్వారా విద్య, ఉన్నత పదవుల్లో రాణిస్తారు. సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈ లింగానికి చేసే పాలాభిషేకం పూర్వ జన్మల పాపాలను తొలగిస్తాయి. ఈ పాలను కాసింత సేవించడం ద్వారా రోగాలు తొలగిపోతాయి. అలాగే మరకత లింగానికి అర్చించబడిన చందనాన్ని నుదుటన ధరిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.