Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దసరా సంబరాలు.. దశమి రోజున జమ్మిచెట్టును ఇలా పూజిస్తే.. సర్వమంగళం

దసరా సంబరాలు.. దశమి రోజున జమ్మిచెట్టును ఇలా పూజిస్తే.. సర్వమంగళం
, ఆదివారం, 25 అక్టోబరు 2020 (05:00 IST)
Jammi Chettu
దసరా సంబరాలు చివరి రోజుకు చేరుకోగానే అందరికీ జమ్మిచెట్టు గుర్తుకు వస్తుంది. రుగ్వేదకాలం నుంచే జమ్మి ప్రస్తావన కనిపిస్తుంది. అప్పట్లో ఈ చెట్టుని అగ్నిని పుట్టించే సాధనంగా వాడేవారు. మనం పురాణాలలోనూ, వేదాలలోనూ తరచూ వినే ''అరణి''ని ఈ జమ్మితోనే రూపొందించేవారు. జమ్మి ఎలాంటి ప్రాంతాలలో అయినా త్వరత్వరగా పెరిగేస్తుంది. నీటి లభ్యత పెద్దగా లేకున్నా కూడా సుదీర్ఘకాలం బతికేస్తుంది. 
 
పట్నం వాసులకు జమ్మి ప్రయోజనాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ రైతులకు, గ్రామీణ ప్రాంతాలవారికీ జమ్మి అంటే ప్రాణం. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి. దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టులోని ప్రతిభాగాన్నీ నాటువైద్యంలో ఔషధాలుగా వాడతారు. ఈ చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అందుకే వినాయక చవినినాడు పూజించే ఏకవింశతి పత్రాలలో శమీపత్రాన్ని కూడా చేర్చారు.
 
ఇకా దసరా పండుగకు జమ్మిచెట్టుకు మధ్య సంబంధం వుంది. ఏడాదిపాటు అజ్ఞాతవాసానికి బయల్దేరిన పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమినాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా పాండవులకు అపరాజితా దేవి ఆశీస్సులు ఉండబట్టే, వారు యుద్ధంలో గెలిచారని నమ్ముతారు.
 
కేవలం పాండవులే కాదు, రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనది చెబుతారు. పైగా జమ్మిచెట్టుని స్త్రీ స్వరూపంగా, శక్తిగా భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహం కూడా రాములవారికి లభించబట్టే, ఆయన రావణునితో జరిగిన సంగ్రామంలో గెలుపొందారట. 
 
జమ్మి చెట్టుకి మన పురాణాలలోనూ, జీవితాలలోనూ ఇంతటి సంబంధం ఉండబట్టే దసరానాడున జమ్మిచెట్టుకి పూజలు చేస్తారు. శమీవృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ ఈ క్రింది శ్లోకాలను చదవటం చేస్తారు. 
''శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ,
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ.
శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా,
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ,
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా,
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే."
 
అలా జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షణలు చేసి.. పూజ ముగిసిన తరువాత జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. కుబేరుడు ఒకనాడు రఘమహారాజుకి భయపడి జమ్మిచెట్లున్న తావున బంగారాన్ని కురిపించాడనే గాథ ప్రచారంలో ఉంది. అలాంటి జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. 
 
దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ… అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ మారింది. ఇకపోతే.. ఈ ఏడాది విజయ దశమిని అక్టోబర్ 25, 2020 ఉదయం 07.41 నుంచి అక్టోబర్ 26 సోమవారం ఉదయం 09.00 గంటల వరకు జరుపుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాహం జరిగి నాలుగేళ్లయింది, కానీ ఇంకా సంతానం కలుగలేదు, సంతాన యోగం వుందా?