దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. నవరాత్రుల్లో దుర్గామాత అమ్మవారిని పూజిస్తారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుండి నవరాత్రులు ప్రారంభమయ్యి అక్టోబర్ 2వ తేదీన ఉత్సవాలు ముగుస్తాయి. తెలంగాణలో నవరాత్రి ఉత్సవాల్లో బతుకమ్మ పండగ జరుపుకుంటారు.
తొమ్మిది రోజులపాటు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆటలు ఆడుతూ దగ్గర్లోని చెరువులో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో దుర్గామాత అమ్మవారి ఆలయాల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ముఖ్యంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఉత్సవాలు అంబరాన్ని అంటుతాయి. తొమ్మిది రోజులపాటు తొమ్మిది అవతారాల్లో కనకదుర్గ దర్శనమిస్తుంది.
అయితే.. ఈ ఏడాది దసరా నవరాత్రులు 9 రోజులు కాకుండా 10 రోజులు వచ్చినట్లు పండితులు చెబుతున్నారు. ఈసారి దేవీ నవరాత్రులు 9 రోజులకు బదులుగా 10 రోజులు ఉండనున్నాయి. ఈ దసరా పండుగ సెప్టెంబర్ 22వ తేదీన ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీన విజయదశమి (దసరా 2025) పండుగతో ముగియనుంది.
ఎందుకంటే.. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే.. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో తృతీయ తిథి ఉపవాసం పాటిస్తారు. ఈ ఏడాది తృతీయ తిథి రెండు రోజులు ఉండటంతో.. ఈ కారణంగా దసరా నవరాత్రి ఉత్సవాల్లో ఒక రోజు పెరిగింది.
ఈ సంవత్సరం చైత్ర నవరాత్రి ఆదివారం రోజు ప్రారంభం కావడం వల్ల.. దుర్గా దేవి ఏనుగుపై భువికి వస్తారని విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దుర్గా దేవి ఏనుగుపై భూమిపైకి రావడం చాలా శుభ సూచకంగా చెబుతున్నారు.