జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ యోగా డేను ప్రభుత్వాలు కూడా అధికారికంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యోగా దినోత్సవానికి ఒక రోజు ముందు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ యోగాపై ఓ ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు.
యోగా ఏ ఒక్క మతానికో చెందినది కాదని, ఇది మొత్తం మానవాళికి చెందినదని అన్నారు. యోగా వల్ల శరీరానికి, మెదడుకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఆరోగ్యం కోసం యోగా అనే ఓ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సంపూర్ణ ఆరోగ్యం కోసం యోగా అనే సందేశాన్ని పంచుతున్న యునైటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్, ఇతర సంస్థలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కోవింద్‌తోపాటు కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, ఆధ్యాత్మకవేత్త కమలేష్ పటేల్, బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.