కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వీరాభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం యడియూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో కలత చెందిన చామరాజనగర్ జిల్లాలోని బొమ్మలపురా గ్రామానికి చెందిన రవి (35) అదే రోజు రాత్రి తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా యడియూరప్ప తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మంగళవారం ఉదయం యడియూరప్ప ఓ ట్వీట్‌లో.. నా రాజీనామా విషయం తట్టుకోలేక గుండ్లపేటకు చెందిన రాజప్ప (రవి) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి చాలా బాధ కలిగింది. రాజకీయాల్లో రాజీనామాలు వంటివి సహజం. దీనికోసమై ప్రాణాలు తీసుకోవడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఈ సమయంలో ఎవరూ ఆందోళన చెందవద్దు. ఈ కష్ట సమయంలో రవి కుటుంబానికి అండగా ఉంటానని యడియూరప్ప తెలిపారు.
కాగా, సోమవారం తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్న సమయంలో యడియూరప్ప.. ఎవరూ ఆందోళనలు చేయవద్దని తన అభిమానులకు విజ్ణప్తి చేశారు. అయినా కొన్నిచోట్ల యడియూరప్ప అభిమానులు కొంత ఆందోళనలు చేశారు. కొన్నిచోట్ల స్వచ్ఛంధంగా దుకాణాలు మూసివేసి తమ ఆవేదన వ్యక్తం చేశారు.