కర్ణాటకలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ తవర్ చంద్ గెహ్లాట్ ఆమోదించారు. ప్రస్తుతానికి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను గవర్నర్ కోరారు.
మరోవైపు, ఆదివారం గోవాలో బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎక్కడా కూడా యడియూరప్పపై వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. పైగా, యడ్డి పాలన బాగానే ఉందంటూ కితాబిచ్చారు.
కానీ, పార్టీ అంతర్గత ఆదేశాల మేరకే యడ్డి సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అర్థమవుతోంది. ఇక, కర్ణాటక తదుపరి సీఎం ఎవరన్నదానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది తేలనుంది.
ఈ మేరకు ఇప్పటికే కొందరి పేర్లను పరిశీలించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలో జరిగే లోక్‌సభ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని బీజేపీ పార్లమెంటరీ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా దళిత నేతను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదిలావుంటే, యడ్యూరప్ప కర్నాటకకు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రెండేళ్ల క్రితం కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలాక ఆయన సీఎం పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారంతో ఆయన ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది.
యడ్యూరప్పకు 78 ఏళ్లు కావడం, ఆయనపై పలు ఆరోపణలు రావడం వంటి అంశాలు ఆయన పదవికి రాజీనామా చేయడానికి కారణాలుగా తెలుస్తోంది. కాగా, 75 ఏళ్లు దాటిన వారు పదవుల్లో ఉండడానికి వీల్లేదని బీజేపీ నిబంధన పాటిస్తోంది. కానీ, యడ్యూరప్పను మాత్రం అధిష్టానం మరో రెండేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండేందుకు ఆయన ప్రమాణ స్వీకారానికి ముందే షరతులు విధించింది.