Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత!

Yashwant Sinha
, మంగళవారం, 21 జూన్ 2022 (12:31 IST)
రాష్ట్రపతి ఎన్నికల కోసం నోటిఫికేషన్ వెలువడింది. కానీ అటు అధికారపక్షం, అటు విపక్ష కూటములు ఇప్పటివరకు తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో తమ కూటమి తరపున బరిలో నిలిపే అభ్యర్థిపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి నేడు సమావేశంకానుంది. అదేవిధంగా విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ మాజీ నేత, టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా పేరును తెరపైకి వచ్చింది. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా తన అభిప్రాయాన్ని సూచనప్రాయంగా వెల్లడించారు. 
 
టీఎంసీ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దేశ ప్రయోజనాల కోసం పార్టీకి దూరంగా పనిచేయాల్సిన సమయం వచ్చిందంటూ సిన్హా మంగళవారం ట్వీట్‌ చేశారు. 'టీఎంసీలో మమతాజీ నాకు ఇచ్చిన గౌరవం, హోదాకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఓ పెద్ద దేశ ప్రయోజనం కోసం పార్టీ నుంచి వైదొలిగి.. ప్రతిపక్షాల ఐక్యత కోసం పనిచేయాల్సిన సమయం వచ్చింది. ఈ ముందడుగును దీదీ ఆమోదిస్తారన్న విశ్వాసం ఉంది' అని సిన్హా ట్విటర్‌లో రాసుకొచ్చారు.
 
రాష్ట్రపతి పదవికి భాజపాయేతర పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండేందుకు ఇప్పటికే ముగ్గురు నేతలు తిరస్కరించడంతో ప్రతిపక్షాలకు కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. రాష్ట్రపతి రేసుకు తొలుత ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విముఖత చూపించగా.. ఆ తర్వాత జమ్మూకాశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా, మహాత్మా గాంధీ మనవడు, పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ కూడా విపక్షాల ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దీంతో యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి వచ్చింది. 
 
అయితే సిన్హాను రాష్ట్రపతి ఎన్నికల్లో దింపాలంటే ఆయన టీఎంసీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌, వామపక్షాలు ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన టీఎంసీకి రాజీనామా చేశారు. కాగా, దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయీకి సన్నిహితుడైన సిన్హాకు వివిధ పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయి. భాజపాను వీడిన ఆయన.. గతేడాది తృణమూల్‌లో చేరారు. 
 
ప్రస్తుతం ఆయన టీఎంసీ ఉపాధ్యక్షునిగా ఉన్నారు. అయితే వాజ్‌పేయీ హయాంలో, మోడీ నేతృత్వంలో పాలన ఎలా మారిందో తేడా చెప్పే క్రమంలో సిన్హా పేరును తెరపైకి వ్యూహాత్మకంగా తెచ్చినట్లు చెబుతున్నారు. నేడు ప్రధాన విపక్షాలతో శరద్‌ పవార్‌ నిర్వహిస్తున్న సమావేశంలో సిన్హా పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిన్హా అభ్యర్థిత్వానికి మమతా బెనర్జీ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
 
మరోవైపు, యశ్వంత్ సిన్హా పేరుపై ఇంకా ఏకాభిప్రాయం రాలేదని, కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే పేరు కూడా పరిశీలనలో ఉందని తెలుస్తోంది. మరి వీరిలో విపక్షాలు ఎవరిని ఎంచుకుంటాయో నేటి సమావేశంలో తెలిసే అవకాశముంది. మరోవైపు, నేడు భాజపా పార్లమెంటరీ బోర్డు కూడా భేటీ కానుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నట్లు సమాచారం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికైన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ