కుట్రపూరితంగా ప్రమాదాలకు ప్రయత్నించే వారిని ఉపేక్షించేది లేదని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ హెచ్చరించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రైలు పట్టాలపై కుట్రపూరితంగా ఎల్పీజీ సిలిండర్లు, సైకిళ్లు, ఇనుపరాడ్లు, సిమెంట్ ఇటుకలు పెట్టి రైలుకు ప్రమాదం తలపెట్టే ఘటనల వల్ల రైల్వే శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా రాష్ట్రాల యంత్రాంగాలు, పోలీసులతో చర్చలు జరుపుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఉద్దేశ్యపూర్వకంగా రైలు ప్రమాదాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, డీజీపీలు, హోంశాఖ కార్యదర్శులతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. జాతీయ దర్యాప్తు సంస్థ కూడా ఇందులో భాగస్వామ్యమై ఉంటుందన్నారు. ప్రమాదాలకు యత్నించే వారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి ఘటనల పట్లే రైల్వేశాఖశ కూడా నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, రైల్వే పోలీసులు, స్థానిక పోలీసులు రైల్వే జోన్ల అధికారులతో కలిసి పని చేస్తారని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.