అగ్రరాజ్యం అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనెటర్ (కాలిఫోర్నియా సెనెటర్) మేరీ అల్వరాడో గిల్‌పై ఆమె వద్ద పని చేసిన ఓ బాధితుడు సంచలన ఆరోపణలు చేశారు. ఆమె వద్ద పనిచేసిన పురుష సిబ్బంది ఈ ఆరోపణలు చేశారు. మేరీ అల్వరాడో తనను ఒక శృంగార బానిసగా వాడుకున్నారని పేర్కొంటూ కోర్టులో దావా వేశాడు.
విధుల్లో ఉన్నప్పుడు ఆమె తనను శృంగార బానిసగా వాడుకున్నారని మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆరోపించారు. ఫలితంగా తాను ఎంతో వేదనను అనుభవించానంటూ తాజాగా ఆమెపై దావా వేశారు. 2022లో అల్వరాడో గిల్ సెనెటర్‌గా ఎన్నికైన తర్వాత బాధిత వ్యక్తిని తన చీఫ్ ఆఫ్ స్టాఫ్ నియమించుకుంది.
విధుల్లో చేరిన కొన్ని రోజుల నుంచే సెనెటర్ తనతో వ్యక్తిగత విషయాలను పంచుకునేవారని, లైంగిక జీవితానికి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడేవారని బాధితుడు దావాలో పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి తనపై ఆమె లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తరచూ అసహజ శృంగారం కోసం డిమాండ్ చేసేవారని, కాదంటే బెదిరించేవారని వెల్లడించారు. బలవంతంగా కోరికలు తీర్చుకునే వారని పేర్కొన్నారు.
ఈ వేధింపుల కారణంగా తాను తీవ్రమైన మానసిక, శారీరక వేదనకు గురయ్యానని బాధితుడు తెలిపారు. వెన్నునొప్పితో పాటు వినికిడి సామర్థ్యాన్ని కోల్పోయానని అన్నారు. ఈ కారణం చెప్పి గతేడాది ఆగస్టులో ఆమె డిమాండ్లను వ్యతిరేకించానని, దీంతో ప్రవర్తన బాగోలేదంటూ తనకు సెనెటర్ నోటీసులు జారీ చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉద్యోగ భద్రత కోసం ఇన్నాళ్లూ ఈ విషయాన్ని బయటపెట్టలేదని పేర్కొన్నారు. అయితే, శాంటాక్లాజ్ కాస్ట్యూమ్ వేసుకోలేదన్న కారణంగా గతేడాది డిసెంబరులో తనను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. తనకు రావాల్సిన వేతన బకాయిలను కూడా ఇవ్వలేదన్నారు. తనకు జరిగిన నష్టానికి గానూ పరిహారం ఇప్పించాలని కోరుతూ శాక్రామెంటో కౌంటీ సుపీరియర్ కోర్టులో దావా వేశారు.
అయితే, ఈ ఆరోపణలను సెనెటర్ కొట్టిపారేశారు. డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎవర్నీ వేధించలేదన్నారు. ఇదిలావుంటే, ఈ సెనెటర్ కొన్ని నెలల కిందట లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా యూఎస్ కాంగ్రెస్ బిల్లును ప్రవేశపెట్టడం గమనార్హం. సెనెటరు వివాహమై ఆరుగురు సంతానం ఉన్నారు. బాధితుడికి కూడా వివాహమైనట్లు దావాలో పేర్కొన్నారు. ప్రస్తుతం దీనిపై కోర్టు విచారణ జరపనుంది.