తమిళనాడు రాష్ట్రంలోని కళ్ళకురిచ్చి జిల్లాలో ఓ దారుణం జరిగింది. ఇడ్లీ తినలేదన్న కోపంతో కన్నబిడ్డను కొట్టి చంపిందో మహిళ. ఈ దారుణం సోమవారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కళ్లకురిచ్చి జిల్లా త్యాగదుర్గం సమీపం మెల్‌విళి గ్రామానికి చెందిన రోసారియో, జయరాణి అనే దంపతులకు రెన్సీమేరీ అనే ఐదేళ్ళ కుమార్తె ఉంది. మూడేళ్ల కిత్రం జయరాణి మృతిచెందడంతో రోసారియో మరో మహిళను వివాహం చేసుకొని వేరుగా ఉండడంతో, బాలిక రెన్సీమేరీ జయరాణి తల్లి పచ్చయమ్మాళ్ ఇంట్లో ఉంటుంది.
అక్కడ జయరాణి అక్క ఆరోగ్యమేరీ కూడా ఉంటుంది. ఆరోగ్యమేరీకి ఇంకా వివాహం కాలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం రెన్సీమేరీని ఇడ్లీ తినమని ఆరోగ్యమేరీ కోరగా, అవి బాగా లేవు, నాకు వద్దంటూ బాలిక బయటకు వెళ్లి స్నేహితులతో ఆడుకోసాగింది.
దీంతో ఆగ్రహించిన ఆరోగ్యమేరీ స్నేహితులతో ఆడుకుంటున్న రెన్సీమేరీని చావబాదుతూ ఇంట్లోకి తీసుకొచ్చి, తలుపులు మూసి కర్రతో తీవ్రంగా కొట్టినట్టు సమాచారం. బాలిక కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకొని రెన్సీమేరీని రక్షించి త్యాగదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అక్కడ ప్రథమ చికిత్సల అనంతరం బాలికను కళ్లకురిచ్చి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే బాలిక మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై త్యాగదుర్గం పోలీసులు కేసు నమోదుచేసి ఆరోగ్యమేరీని అరెస్టు చేసి జైలుకు తరలించారు.