Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్ : క్షిపణులను భారత్‌కు గురిపెట్టిన చైనా

సరిహద్దుల్లో టెన్షన్.. టెన్షన్ : క్షిపణులను భారత్‌కు గురిపెట్టిన చైనా
, గురువారం, 10 సెప్టెంబరు 2020 (10:53 IST)
భారత్ - చైనా దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనా.. తాజాగా భారత్ వైపు క్షిపణులను గురిపెట్టింది. దీంతో భారత బలగాలు కూడా అప్రమత్తమయ్యాయి. 
 
ముఖ్యంగా రెజాంగ్ లా సమీపంలో చైనా దళాలు దూకుడుగా వ్యవహరిస్తుండగా, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధీటుగా ఎదుర్కొనేందుకు భారత దళాలు సన్నద్ధంగా ఉన్నాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
 
ఇక రెజాంగ్ లా పరిధిలో సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల ఎత్తున భారత్ తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంది. ఇవి తాజా శాటిలైట్ చిత్రాల్లోనూ స్పష్టంగా కనిపిస్తూ ఉండటం గమనార్హం. ఇదే ప్రాంతంలో చైనా దళాలు 4 వేల మీటర్ల ఎత్తు వరకూ మాత్రమే వెళ్లగలిగాయి. చైనా దళాలతో పోలిస్తే, భారత జవాన్లు దాదాపు కిలోమీటర్ ఎత్తున మోహరించి ఉన్నాయి. ఇది భారత సైనికులకు కలిసివచ్చేది.
 
ఇకపోతే, ఈ ప్రాంతంలో చైనా తన అత్యధునిక ఎఫ్-15 యుద్ధ విమానాలను, రాడార్లను, విమాన విధ్వంసక క్షిపణులను మోహరించగా, భారత్ కూడా.. మిగ్, సుఖోయ్ తదితర ఫైటర్ జెట్లతో అనుక్షణమూ పహారా కాస్తోంది. రష్యా నుంచి తెప్పించిన ఫైటర్ జెట్ విధ్వంసక క్షిపణులను కూడా లడఖ్ ప్రాంతానికి తరలించింది. 
 
అలాగే, గురువారం నుంచి జాతికి అంకితంకానున్న రాఫెల్ యుద్ధ విమానాలు కూడా సైన్యానికి వెన్నుదన్నుగా నిలువనున్నాయి. వీటిని కూడా వీలైనంత త్వరగా చైనా సరిహద్దులకు తరలించాలని భారత సైనిక వర్గాలు భావిస్తున్నాయి. ఇరు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బలగాలను, ఆయుధాలు, క్షిపణులను మొహరిస్తుండటంతో సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొనివుంది.                 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా వాయుసేన అదుర్స్.. రోబో జాగిలాల ప్రయోగం సక్సెస్