అతి చిన్నదేశమైన మాలిలో సైనిక తిరుగుబాటు వచ్చింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతా దేశ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. సైనిక తిరుగుబాటుతో రక్తపాతం వద్దని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ... ఆయన తన పదవి నుంచి స్వచ్చంధంగా తప్పుకున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం తెల్లవారుజామున తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు జాతీయ టీవీలో ప్రకటించారు. నిజానికి ఆయన పదవీకాలం మరో మూడోళ్ళపాటు ఉంది.
కానీ, ఆ దేశ సైనికులు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఫలితంగా బౌబాకర్ కీతా బుధవారం తెల్లవారుజామున తన పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తిరుగుబాటు చేసిన సైనికులు అధ్యక్షుడు ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్నారు.
అంతకుముందు విజయ సూచకంగా అతని ఇంటి బయట గాలిలోకి కాల్పులు జరిపారు. రాజధాని నగరం బొమాకోను తమ ఆధీనంలోకి తీసకున్నారు. అధ్యక్షుడితోపాటు ప్రధాని బౌబౌ సిస్సేను మంగళవారం మధ్యాహ్నం నిర్బంధించారు. తిరుగుబాటు సైనికులతోపాటు, ప్రజలు కూడా భారీగా రోడ్లపైకి వచ్చారు.