ఏడడుగుల సంబంధం... వివాదాలతో విడిపోయిన 21 ఏళ్ళకు మళ్ళీ కలిసింది. అదీ! సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ పుణ్యామా అని. 498 ఎ కేసులో ఏళ్ళుగా కొట్లాడుకుంటున్న ఓ జంటను తనదైన శైలిలో విచారించి, ఇద్దరినీ ఒకటి చేశారు రమణ. అదీ సుప్రింకోర్టులో, తొలిసారి తెలుగులో విచారించి, కేసును సుఖాంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జంట, 21 ఏళ్ళ క్రితం గొడవపడి విడివిడిగా ఉంటోంది. వీరిద్దరి మధ్య 498 ఏ కేసు నడుస్తోంది. లోకల్ కోర్టు మొదలుకొని హైకోర్టు వరకు వ్యాజ్యం నడిచి, భర్తకు ఏడాది జైలు, వెయ్యి రూపాయల జరిమానా పడింది. దీనిపై భర్త సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణకు రాగా, జస్టిస్ ఎన్. వి. రమణ తనదైన శైలిలో విచారణ చేపట్టారు.
కక్షిదారు అయిన ఆ మహిళ తన వాదనలును వినిపించేందుకు ఇంగ్లిషు రాక ఇబ్బంది పడుతోందని జస్టిస్ రమణ తెలుగులోనే మాట్లాడి, ఆమె వాదన విన్నారు.... అర్థం చేసుకున్నారు. ఆమె చెప్పిన విషయాన్ని జస్టిస్ రమణ, ఇంగ్లీష్ లోకి అనువదించి, తన సహచర న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు వివరించారు.
మీరు 21 ఏళ్ళు విడి విడిగా ఉండి ఏం సాధించారు? నీ భర్తకు జైలు శిక్ష విధిస్తే, ఆయన ఉద్యోగం కూడా పోతుంది. అపుడు నీకు మెయింటెనెన్స్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. అసలు మీరిద్దరూ కలిసి ఎందుకు ఉండకూడదు అని జస్టిస్ రమణ హితబోధ చేశారు. దీనితో ఆ మహిళ తనకు భర్తతో కలిసి ఉండటానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఆమె భర్తతో కూడా తెలుగులోనే మాట్లాడిన సిజే రమణ... ఎపుడూ భార్యను వేధించవద్దని, ఇద్దరూ చక్కగా కలిసి ఉంటే... జీవితం ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు.
ఇలా తనదైన శైలిలో ఆ జంటను కలిపారు. తమ తప్పులు తెలుసుకున్న భార్యాభర్తలు... ఒకరిపై ఒకరు పెట్టిన కేసులు కూడా ఉపసంహరించుకుని, చక్కగా కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు.
సహృదయంతో ఒక జంటను కలపడమే కాకుండా, సుప్రీం కోర్టులో తెలుగులో వాదనలు విని సీజే రమణ తెలుగుపై తనకున్న మమకారాన్ని, మాతృ భాషపై ఉన్న గౌరవాన్ని చాటారు. శభాష్... జస్టిస్ ఎన్.వి.రమణ.