Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెగాసస్ స్పై వేర్‌పై విచారణ జరిపించాలి.. సుప్రీంలో పిటిషన్

Advertiesment
పెగాసస్ స్పై వేర్‌పై విచారణ జరిపించాలి.. సుప్రీంలో పిటిషన్
, గురువారం, 22 జులై 2021 (14:25 IST)
ఇజ్రాయెల్‌ దేశానికి చెందిన పెగాసస్ స్పైవేర్‌తో ప్రభుత్వ సంస్థలు కొందరిపై నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తు చేయించాలని కోరింది. 
 
ప్రముఖ న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పెగాసస్ కుంభకోణం చాలా తీవ్రమైనదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది భారత దేశ ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ, దేశ భద్రతలపై తీవ్రమైన దాడిగా ఆయన అభివర్ణించారు. 
 
నిఘాను విస్తృతంగా, యథేచ్ఛగా, జవాబుదారీతనం లేకుండా ఉపయోగించడం నైతికంగా వికృతమని ఆరోపించారు. వ్యక్తిగత గోప్యత అంటే దాచిపెట్టాలనే కోరికకు సంబంధించినది కాదని, ఒకరి సొంతానికి ఉండే వ్యక్తిగత పరిధికి సంబంధించినదని పేర్కొన్నారు. 
 
మన భావాలు, ఉనికి వేరొకరి ప్రయోజనాలకు సాధనం కానటువంటి పరిధి వ్యక్తిగత పరిధి అని పేర్కొన్నారు. మర్యాద, మంత్రాంగంలో ముఖ్యమైన భాగం ఇదని తెలిపారు. 
 
పెగాసస్ స్పైవేర్‌ను ఉపయోగించడం కేవలం ఓ వ్యక్తి సంభాషణలను చాటుగా వినడం మాత్రమే కాదని, ఆ వ్యక్తి యావత్తు జీవితానికి సంబంధించిన డిజిటల్ ఇంప్రింట్‌ను తెలుసుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చునని తెలిపారు. 
 
ఫోన్ యజమానిని మాత్రమే కాకుండా ఆ వ్యక్తితో కాంటాక్ట్‌లో ఉండేవారందరి గురించి తెలుసుకోవడానికి దారి తీస్తుందని వివరించారు. సర్విలెన్స్ టెక్నాలజీ వెండర్లు విపరీతంగా పెరగడం వల్ల అంతర్జాతీయ భద్రత, మానవ హక్కుల సమస్య ఉత్పన్నమవుతుందని హెచ్చరించారు. 
 
ఎన్ఎస్ఓ గ్రూప్ కంపెనీ క్లయింట్లు దాదాపు 50 వేల ఫోన్ నంబర్లను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని ఈ పిటిషన్ సుప్రీంకోర్టుకు తెలిపింది. పెగాసస్ అనేది కేవలం నిఘా సాధనం మాత్రమే కాదని, ఇది సైబర్ ఆయుధమని, దీనిని భారత ప్రభుత్వ వ్యవస్థపై ప్రయోగిస్తున్నారన్నారు. 
 
సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని ఈ పిటిషన్ కోరింది. ఈ కుంభకోణంలో నిందితులందరినీ శిక్షించాలని కోరింది. పెగాసస్ స్పైవేర్‌ను కొనడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించాలని కోరింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణలో రాగల 48 గంటల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్