సరిగ్గా ఆరునెలలు కూడా కాలేదు. అప్పుడే బ్రేకప్. మే నెలలో వివాహం చేసుకున్న ఓ వివాహ జంట తామిక కలిసి ఉండలేమని డిసైడ్ అయ్యింది. విడాకులు కావాలంటూ భర్త కోర్టును ఆశ్రయించాడు. ఇంతకీ తెగదెంపులకు సిద్థమైన భార్యాభర్తలెవరు. ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు.
అత్యంత ఆర్భాటంగా వివాహం. 10 వేల మంది అతిధులు. వెయ్యిమందికి పైగా అతిరథ మహారథులు. గత మే 12వ తేదీన దూంధాంగా జరిగిన పెళ్ళి బీహార్ మాజీ సిఎం లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, ఆర్ జేడీ సీనియర్ నాయకురాలు చంద్రికారాయ్ కుమార్తె ఐశ్వర్యరాయ్‌తో గ్రాండ్‌గా జరిగింది. అప్పట్లో ఈ పెళ్ళి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పెరోల్ విడుదలై మరీ కుమారుడి వివాహానికి హాజరయ్యారు లాలూ ప్రసాద్ యాదవ్.
అంతేకాదు ఈ వివాహంలో తినుబండారాల కోసం జరిగిన గొడవ చర్చకు దారితీసింది. ఎంతో ఆర్భాటంగా పెళ్ళి చేసుకున్న జంట ఆరునెలల్లోనే విడాకులకు సిద్థమయ్యారు. తనకు విడాకులు కావాలంటూ తేజ్ ప్రతాప్ యాదవ్ పట్నా కోర్టును కోరాడు. తన భార్య ఐశ్వర్యారాయ్‌కు తనకు మధ్య సఖ్యత లేదని, ఇద్దరి మధ్యా పొసగడం లేదని, సంసార జీవితానికి తనకు సహకరించడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ విధంగా కలిసి ఎంతోకాలం జీవించలేమని పిటిషన్లో కోరాడు. తనకు ఐశ్వర్యా రాయ్‌తో పెళ్లి వద్దన్నప్పటికీ తన తండ్రి బలవంతంపై ఈ వివాహం అంగీకరించినట్లు ప్రతాప్ చెపుతున్నాడు.