మొబైల్ ఫోన్స్‌కు అనేక మోసపూరిత, అవాంఛిత (స్పామ్) ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వీటివల్ల వినియోగదారుడుకి తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఇలాంటి వాటిని గుర్తించేందుకు వీలుగా ప్రస్తుతం థర్డ్ పార్టీ యాప్ ట్రూకాలర్ ఉంది. అయితే, ఇకపై దీంతో సంబంధం లేకుండా స్పామ్ కాల్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు వీలుగా టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చర్యలు చేపట్టింది. ట్రాయ్ తీసుకున్న చర్యలతో ఇకపై ఆయా టెలికాం కంపెనీలు కాలర్ ఐడీ సేవలను తీసుకురానున్నాయి.
ఎవరైనా కాల్ చేసినపుడు ఎలాంటి యాప్ సాయం లేకుండానే స్క్రీన్‌పై కాలర్ పేరు కనిపిస్తుంది. ఇందుకోసం జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. ఇందులోభాగంగా హెచ్.పి., డెల్, ఎరిక్‌సన్, నొకియా వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంటున్నాయి.
అయితే, ఈ సేవలను దశలవారీగా అమల్లోకి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. తొలుత ఏ నెట్‌వర్క్ యూజర్‌కు అదే నెట్‌ర్క్ నుంచి వచ్చే కాల్స్‌కు మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జియో యూజర్‌కు ఎయిర్‌టెల్ నుంచి కానీ వొడాఫోన్ నుంచి కానీ వచ్చే కాల్స్‌కు ఇది వర్తించదు. అయితే, టెలికాం కంపెనీలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని పరస్పరం పంచుకునేందుకు అంగీకరిస్తే అపుడు ఏ నెట్‌వర్క్ నుంచి ఎవరు ఫోన్ చేసినా కాలర్ ఐడీ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఈ సేవలు అందుబాటులోకి వస్తే స్పామ్ కాల్స్‌కు చెక్ పడినట్టే.