ఇటీవల వాట్సాప్ సరికొత్త గోప్యతా విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీనిపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఈ విషయంలో వాట్సాప్ భారత్ విభాగం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఒకదశలో కేంద్రంతో ఘర్షణకు కూడా దిగింది. చివరకు కేంద్రం ఇచ్చిన వార్నింగ్‌తో దిగివచ్చింది.
ఫలితంగా పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు చట్టంగా మారేంత వరకు కొత్త గోప్యతా విధానాలను వినియోగదారులపై బలవంతంగా రుద్దబోమని ఢిల్లీ హైకోర్టుకు వాట్సాప్ తెలిపింది. ఆ విధానాలను ప్రస్తుతానికి పక్కనపెట్టినట్టు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ డి.ఎన్. పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ల ధర్మాసనం ముందు వాట్సాప్, ఫేస్ బుక్‌ల తరపున సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు.
ఇప్పటికే ప్రైవసీ పాలసీని చాలా మంది ఆమోదించారని చెప్పారు. బిల్లు పాసై అందులోని విషయాలు తమకు అనుకూలంగా ఉంటే అప్పుడు ప్రైవసీ పాలసీని అమలు చేస్తామని చెప్పారు.
ప్రస్తుతానికి వినియోగదారులను ఈ విషయంలో ఇబ్బంది పెట్టట్లేదని, విధానాలకు అంగీకరించని వారి ఖాతాలను బ్లాక్ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే, యూజర్లకు మాత్రం ప్రైవసీ పాలసీకి సంబంధించిన అప్ డేట్ మాత్రం కనిపిస్తూనే ఉంటుందని చెప్పారు.
కొత్త ప్రైవసీ పాలసీపై దర్యాప్తు చేయాల్సిందిగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించడాన్ని తప్పుపడుతూ వాట్సాప్, ఫేస్‌బుక్‌లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అయితే, సంస్థల విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.