Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా తలపై నుంచి 50 బులెట్లు దూసుకెళ్లాయి.. దూరదర్శన్ జర్నలిస్టు

నా తలపై నుంచి 50 బులెట్లు దూసుకెళ్లాయి.. దూరదర్శన్ జర్నలిస్టు
, బుధవారం, 31 అక్టోబరు 2018 (11:35 IST)
నా తలపై నుంచి 50 బుల్లెట్లు దూసుకెళ్లాయని మావోయిస్టుల దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన దూరదర్శన్‌ జర్నలిస్టు ధీరజ్ కుమార్ చెప్పారు. ఆ కొన్ని క్షణాలు అత్యంత భయానకంగా గడిచాయని ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలోని ఎన్నికల ఏర్పాట్లను కవర్‌ చేయడానికి వెళ్లిన దూరదర్శన్‌ జర్నలిస్టులపై మావోయిస్టులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కెమెరామెన్‌ అచ్యుతానంద్‌ సాహూతో పాటు మీడియా బృందానికి భద్రతాగా వెళ్లిన ఇద్దరు పోలీసులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ భయానక ఘటన గురించి ధీరజ్‌ మీడియాకు వివరించారు. 
 
అది ఆయన మాటల్లోనే.. 'నిల్వాయా ప్రాంతంలో ప్రజలు 1998 నుంచి ఓటు వేయడం లేదు. ఈసారి వారు ఓటేసేందుకు వీలుగా కొత్తగా ఏర్పాటుచేసిన పోలింగ్‌ కేంద్రాన్ని కవర్‌ చేసేందుకు నేనూ, అచ్యుతానంద్‌ అక్కడకు వెళ్లాం. వెళ్లేముందు దంతెవాడ ఎస్పీని కలిశాం. ఆయన మాకు అనుమతినిచ్చారు. భద్రత కూడా కల్పిస్తామన్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో మేమూ, భద్రతాసిబ్బంది మోటార్‌సైకిళ్లపై బయల్దేరాం. కాసేటికే మా ముందు వెళ్తున్న బైక్‌ కిందపడిపోయింది. ఆ వెనుకే ఉన్న మా కెమెరామెన్‌ సాహూకు బులెట్‌ తగిలింది. నా కళ్లముందే సాహూ కుప్పకూలాడు. 
 
నేను కూర్చున్న బైక్‌ కూడా కిందపడిపోయింది. అయితే అదృష్టవశాత్తు నేను పక్కనే ఉన్న ఓ గుంతలో పడిపోయాను. అక్కడే దాక్కున్నాను. ఆ తర్వాత 45 నిమిషాలు చాలా భయానకం. బులెట్‌ శబ్దాలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి. దాదాపు 50 బులెట్లు నా తలపై నుంచే వెళ్లాయి. గుంతలో ఉండటంతో మావోయిస్టులు నన్ను చూడలేదు అని ధీరజ్ చెప్పారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పోలీసులు గాయపడగా.. వారిని దంతేవాడ ఆసుపత్రికి తరలించారు. మరికొద్ది రోజుల్లో ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'ఉక్కు మనిషి'కి ఘన నివాళి... సమైక్యతా మూర్తికి శిరసెత్తి వందనం