పని లేదు కదా అని 'అదే' పనిలో వుండాలనుకునే పురుషులకు హెచ్చరిక! కరోనా ప్రభావం కారణంగా ఏర్పడిన భయం సమయంలో సంతానం కోసం ప్రయత్నించే పురుషులకు ప్రమాదమని చెబుతున్నారు వైద్యులు. ఆందోళన, మానసిక ఆరోగ్యంతోపాటు వీర్యం నాణ్యతనూ దెబ్బతీస్తుందని, వీలైనంతవరకు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
'కరోనా ఎప్పుడెలా ముంచుకొస్తుందో? ఇంకెంత కాలముంటుందో?'.. అందరిలోనూ ఇదే ఆందోళన. ఇలాంటి భయాలను కాస్త తగ్గించుకోండి. సంతానం కోసం ప్రయత్నించే పురుషులకు ఇది ఇంకా ముఖ్యం. ఎందుకంటే చాలాకాలం పాటు వెంటాడే ఇలాంటి భయాలు, ఆందోళన మానసిక ఆరోగ్యాన్నే కాదు వీర్యం నాణ్యతనూ దెబ్బతీస్తాయి. దీని ప్రభావం పుట్టబోయే పిల్లల మీదా పడుతుంది.
మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయ అధ్యయనం ఈ విషయాన్నే నొక్కి చెబుతోంది. మన కణాల వెలుపల ద్రవంతో కూడిన సూక్ష్మమైన తిత్తులుంటాయి. ఇవి కణాల మధ్య ప్రోటీన్లు, కొవ్వులు, న్యూక్లిక్ ఆమ్లాల వంటి వాటిని చేరవేస్తుంటాయి. పునరుత్పత్తి వ్యవస్థలో పెద్దఎత్తున ఉత్పత్తి అయ్యే ఇవి వీర్యం నాణత్యలో కీలకపాత్ర పోషిస్తాయి.
సంతానం కోసం ప్రయత్నించే మగవారు దీర్ఘకాలం ఒత్తిడికి గురైతే దాని దుష్ఫలితాలు ఈ కణబాహ్య తిత్తుల్లో తలెత్తే మార్పుల గుండా పిండానికి చేరుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఇవి పిండం మెదడు ఎదుగుదల మీద విపరీత ప్రభావం చూపుతున్నట్టు కనుగొన్నారు.