Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి ఇకలేరు.. ఢిల్లీ ఎయిమ్స్‌లో కన్నుమూత

sitaram yechuri

ఠాగూర్

, గురువారం, 12 సెప్టెంబరు 2024 (16:43 IST)
కమ్యూనిస్టు పార్టీకి చెందిన సీనియర్ నేత, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ ఇకలేరు. ఆయన గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 77 యేళ్ళు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్‌లో కొద్ది వారాలుగా చికిత్స పొందుతూ వచ్చిన ఆయన... ఆరోగ్యం విషమించడంతో గురువారం తుదిశ్వాస విడిచారు. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్‌గా గుర్తింపు పొందిన ఏచూరి.. 1992 నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
 
మద్రాస్ నగరంలో గత 12 ఆగస్టు 1952వ తెలుగు కుటుంబంలో జన్మించిన సీతారాం ఏచూరీ తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్‌ కందాకు మేనల్లుడు. ఏచూరి బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 
 
అనంతరం దిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో చేరారు. 1970లో సీబీఎస్‌సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్‌గా నిలిచారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా పొందారు. అక్కడే పీహెచ్‌డీలో చేరినా.. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో దాన్ని కొనసాగించలేకపోయారు. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి మజుందార్‌. జర్నలిస్టు సీమా చిశ్తీని రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం.
 
ఢిల్లీలో విద్యాభ్యాసం చేసే సమయంలో ఎస్.ఎఫ్.ఐ భావజాలానికి ఆకర్షితుడైన ఆయన అందులో చేరారు. అలా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఎంలో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయిన వారిలో ఆయన కూడా ఒకరు. జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్‌కు మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 
 
సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరాత్‌తో కలిసి జేఎన్‌యూను వామపక్ష కోటగా మార్చారు. ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. 1984లో సీపీఎం కేంద్ర కమిటీలో చేరారు. 1992లో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఎం మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.
 
ప్రజాసమస్యలు, ఇతర అంశాలపై గళం విప్పుతూ.. ఎగువ సభలో సీతారాం ఏచూరి గుర్తింపు పొందారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం ‘ఉమ్మడి కార్యాచరణ కార్యక్రమం ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంతోపాటు ఏచూరి కీలకంగా వ్యవహరించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషించారు. 
 
రచయితగానూ మంచి గుర్తింపు ఉంది. ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరిట ఓ ఆంగ్లపత్రికకు కాలమ్స్‌ రాశారు. ‘క్యాస్ట్‌ అండ్‌ క్లాస్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌ టుడే’, ‘సోషలిజం ఇన్‌ ఛేంజింగ్‌ వరల్డ్‌’, ‘మోదీ గవర్నమెంట్‌: న్యూ సర్జ్‌ ఆఫ్‌ కమ్యూనలిజం’, ‘కమ్యూనలిజం వర్సెస్‌ సెక్యులరిజం’ వంటి పుస్తకాలు రాశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమేజాన్‌లో 110,000 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు