భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ అన్షుమన్ గైక్వాడ్ ఇకలేరు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 71 యేళ్ళు. 1974-87 మధ్య గైక్వాడ్ భారత జట్టు తరపున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. మొత్తం 2254 పరుగులు చేశారు. వాటిలో రెండు శతకాలు ఉన్నాయి. 1983లో జలంధర్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 201 పరుగులు చేశాడు. టీమిండియాకు రెండుసార్లు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. 1997-99 మధ్య కాలంలో ఒకసారి కోచ్‌గా వ్యవహరించాడు. అన్షుమన్ కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. 1990ల్లో జాతీయ టీమ్ సెలెక్టర్, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
కాగా, అన్షుమన్ గైక్వాడ్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. క్రికెట్‌కు గైక్వాడ్ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని, తను మరణించారన్న వార్త బాధ కలిగిస్తోందంటూ తన సంతాప సందేశాన్ని వెల్లడించారు. కుటుంబ సభ్యులకు ప్రధాని సానూభూతి వ్యక్తం చేశారు. బీసీసీఐ కార్యదర్శి జైషాతో, మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీతో పాటు పలువురు క్రికెటర్లు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.
గైక్వాడ్ క్యాన్సర్ చికిత్సకు సంబంధించి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఇటీవల ఆదుకోవాలని బీసీసీఐకి దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ విన్నవించిన సంగతి తెలిసిందే. కపిల్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు సైతం బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన బీసీసీఐ గైక్వాడ్ చికిత్సకు తక్షణం సాయం కింద రూ. కోటి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఇంతలోనే చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.