దేశంలోని గర్భిణులు కూడా కరోనా వ్యాక్సిన్లను వేయించుకోవచ్చని, అవి సురక్షితమైనవేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. గర్భిణులు వ్యాక్సిన్ వేయించుకుంటే ప్రమాదమని ఇటీవల ఇంటర్నెట్‌లో వెల్లువెత్తుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు.
మహిళలు గర్భందాల్చినప్పుడు మొదట ఏర్పడే మాయకు వ్యాక్సిన్ వల్ల ఎటువంటి హాని కలుగదని పరిశోధనకు నేతృత్వం వహించిన నార్త్‌వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన ఫీన్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జెఫరీ గోల్డ్‌స్టీన్ తెలిపారు.
ఇదే అంశంపై ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. కోవిడ్ టీకాలను గర్భిణులకు ఇవ్వవచ్చు అని కేంద్ర ఆరోగ్యశాఖ తన మార్గదర్శకాల్లో సూచించిందని పేర్కొంది. ప్రెగ్నెంట్ మహిళలకు కూడా ఇవ్వాల్సిందేనని ఐసీఎంఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు.
సార్స్ సీవోవీ2 వేరియం ట్లు అయిన ఆల్పా, బీటా, గామా, డెల్టాలపై కోవీషీల్డ్, కోవాక్సిన్ టీకాలు పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలో ఒకే ఒక దేశం పిల్లలకు వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ఐసీఎంఆర్ చీఫ్ తెలిపారు.
అయితే మరి చిన్న పిల్లలకు వ్యాక్సిన్ అవసరమా అన్నది ఇంకా తెలియని ప్రశ్నగానే మిగిలిపోయిందని ఆయన పేర్కొన్నారు. డేటా పూర్తిగా తెలియనంత వరకు.. పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వలేమని బలరామ్ భార్గవ్ వెల్లడించారు. దీనిపై తాము స్టడీ కూడా చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. 2 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వాటి ఫలితాలు సెప్టెంబర్ వరకు వస్తాయన్నారు.