ఆధార్- పాన్ కార్డు అనుసంధానం ఇంకా పూర్తి చేయని వారికి గుడ్ న్యూస్. ఆధార్- పాన్ కార్డు అనుసంధాన ప్రక్రియ గడువును కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఆర్థిక లావాదేవీలు, ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడంలో కీలకమైన ఈ అనుసంధాన ప్రక్రియను సెప్టెంబర్ 30 వరకు పాన్ కార్డు దారులు తమ ఆధార్ కార్డుతో అనుసంధానించుకోవచ్చు. ఈ నెలాఖరుతో ముగియనున్న ఈ గడువును మరో దఫా పొడిగించింది.
అలాగే సొంతింటిపై పెట్టుబడి పెట్టే వారికి పన్ను మినహాయింపును మూడు నెలలకు పైగా పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం తెలిపింది. అలాగే వివాద్ సే విశ్వాస్ చెల్లింపుల పథకాన్ని రెండు నెలలు పొడిగించింది.
కరోనా చికిత్స పొందిన వారికి, మరణించిన వారికి పన్ను మినహాయింపు కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఒక ఉద్యోగికి యాజమాన్యం చెల్లించిన కొవిడ్ వైద్య చికిత్స మొత్తంపై పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు ఇది వర్తిస్తుంది.