గతంలో గూగుల్ మ్యాప్ ఆధారంగా ఓ కారు చెరువులో పడిన ఘటన గుర్తుండి వుంటుంది. తాజాగా జీపీఎస్ నావిగేషన్ తప్పిదం ముగ్గురి ప్రాణాలు తీసింది. నావిగేషన్ మ్యాప్ తప్పుగా చూపించడంతో ఓ కారు నిర్మాణంలో వున్న వంతెనపై నుంచి పడిన ఘటన యూపీలోని బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు బరేలీ నుంచి బదౌన్‌కు వెళ్తూ.. ఖల్పూర్ - దతాగంజ్ రహదారిపై వేగంగా ప్రయాణించిన కారు నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి రామగంగా నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కారులోంచి మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నావిగేషన్ పొరపాటు వల్లే నిర్మాణంలో వంతెనపైకి కారు చేరినట్లు తెలుస్తోంది. కాగా, కొన్ని నెలల కిందట భారీ వరదల కారణంగా నిర్మాణంలోని వంతెన ముందు భాగం నదిలో కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు.