ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఓ విద్యార్థి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. పరీక్షలో తప్పు రాశాడనీ చావబాదాడు. ఈ దెబ్బలు తీవ్రంగా తగలడంతో ఆ విద్యార్థి స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. ఆ విద్యార్థి ఆస్పత్రిలో 18 రోజుల పాటు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషాదకర ఘటన యూపీని ఔరైయా జిల్లాలో జరిగింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అఛల్దా పోలీస్‌స్టేషను పరిధిలోని ఆదర్శ్ కళాశాలలో వైషోలి గ్రామానికి చెందిన నిఖిత్ కుమార్ (15) పదో తరగతి చదువుతున్నాడు. సెప్టెంబరు 7న సైన్స్ టీచర్ అశ్వనీసింగ్ ఓ పరీక్ష నిర్వహించారు.
ఆ పరీక్షలో ఒకే ఒక్క పదాన్ని నిఖిత్ తప్పుగా రాశాడు. దీంతో పట్టరాని కోపంతో విద్యార్థి జట్టు పట్టుకొని కర్రతో టీచర్ దారుణంగా చావబాదాడు. దీంతో నిఖిత్ స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన బాలుణ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం లక్నో వెళ్లినా ఉపయోగం లేకపోయింది. కళాశాల ప్రిన్సిపాల్ సూచన మేరకు నిఖిత్ వైద్య ఖర్చు రూ.40 వేలు.. అశ్వనీసింగ్ భరించారు. చికిత్స పొందుతూ సోమవారం నిఖిత్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.