'మాట తప్పడం వారి నైజం.. వారి వాగ్దానాలను ఎలా నమ్మను?' అంటూ పాకిస్థాన్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తనదైనశైలిలో కవితాత్మకంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించడంపై ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందని భారత్, పాకిస్థాన్ అంగీకరించారు. అయితే, ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించింది. దానికి భారత సాయుధ బలగాలు తగిన రీతిలో జవాబిచ్చాయని భారత్ శనివారం రాత్రి ఓ ప్రటనలో పేర్కొంది.
ఈ పరిణామాల నేపథ్యంలో శశిథరూర్ శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎక్స్ వేదికగా ఒక హిందీ ద్విదను పోస్ట్ చేశారు. "ఉస్కీ ఫిత్రత్ హై మకర్ జానే కీ, ఉస్కే వాదే పే యకీన్ కైసే కరూ?" (#ceasefireviolated అనే హ్యాష్‌ట్యాగ్) అని పేర్కొన్నారు. మాట తప్పడం వారి నైజం, వారి వాగ్ధాలను ఎలా నమ్మను? అని ఈ కవితకు అర్థం.
అంతకుముందు కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత ఒక కార్యక్రమంలో శశిథరూర్ మాట్లాడుతూ, నాకు చాలా సంతోషంగా ఉంది. భారత్ ఎపుడూ దీర్ఘకాలిక యుద్ధాన్ని కోరుకోలేదు. కానీ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలనుకుంది. ఆ గుణపాఠం చెప్పారని నేను నమ్ముతున్నాను అని వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకాశ్మీర్‌లో పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది భారత పర్యాటకులను కాల్చివేసిన విషయం తెల్సిందే. దీనికి ప్రతీకారంగా భారత్ ఉగ్రస్థావరాలపై ప్రతీకార చర్యకు దిగింది. ఫలితంగా భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయి.