ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో తన భర్తతో జరిగిన కుటుంబ వివాదం కారణంగా 30 ఏళ్ల మహిళ తనను తాను నిప్పంటించుకుని తీవ్ర గాయాలపాలైందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం బాన్‌పూర్ ప్రాంతంలో జరిగిందని వారు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. సంజు రాజా భార్య ఆర్తి (30) బరై గ్రామంలోని వారి ఇంట్లో తన భర్తతో జరిగిన గొడవ తర్వాత తన శరీరంపై కిరోసిన్ పోసుకుని తనను తాను నిప్పంటించుకుందని లలిత్‌పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ కలు సింగ్ తెలిపారు.
ఆమెను మొదట లలిత్‌పూర్ జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఆమె పరిస్థితి విషమించడంతో ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు అని సింగ్ చెప్పారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, తన భర్త తనను పుట్టింటికి వెళ్లడానికి నిరాకరించాడని, అందుకే తాను ఈ చర్య తీసుకున్నానని ఆ మహిళ ఆరోపించింది.
మహిళ కుటుంబం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ఫిర్యాదు చేయలేదని ఏఎస్పీ తెలిపారు. కానీ లిఖితపూర్వక ఫిర్యాదు అందిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి పోలీసు సిబ్బందిని ఆసుపత్రికి పంపినట్లు ఆయన తెలిపారు.