Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెల్మెట్ ధరించలేదని కారు డ్రైవర్‌కు అపరాధం విధించిన యూపీ పోలీసులు!

tushar sacsena

ఠాగూర్

, సోమవారం, 26 ఆగస్టు 2024 (08:51 IST)
రోడ్డు ప్రమాదాలకు గురైనపుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీచేశాయి. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు అపరాధం విధిస్తున్నారు. అయితే, ఓ కారును డ్రైవ్ చేసే డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని పేర్కొంటూ రూ.1000ను ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, దీనిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తుషార్ సక్సేనా అనే కారు డ్రైవర్ స్పందిస్తూ, తాను ఎప్పుడూ కారులో నోయిడాకు వెళ్లలేదని, కానీ అక్కడి ట్రాఫిక్ పోలీసులు మాత్రం హెల్మెట్ లేదనే కారణంతో తనకు రూ.1000 జరిమానా విధించారని తుషార్ సక్సేనా వాపోయాడు. జరిమానాకు సంబంధించి మొదట ఒక మెసేజ్ రాగా దానిని తాను పట్టించుకోలేదని, ఏదో పొరపాటున వచ్చి ఉంటుందిలే అని భావించానని చెప్పాడు. 
 
అయితే ఆ తర్వాత ఒక ఈ-మెయిల్, మరొక మెసేజ్ కూడా రావడంతో విషయం అర్థమైందన్నారు. నోయిడాకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ జిల్లాలో తాను నివసిస్తున్నానని అతడు వివరించాడు. జరిమానా విషయమై ట్రాఫిక్ పోలీసులను సంప్రదించానని, హెల్మెట్ లేకుండా ఫోర్-వీలర్ వాహనాన్ని నడిపినందుకు ఫైన్ విధించామంటూ సమాధానం ఇచ్చారని తుషార్ సక్సేనా వాపోయాడు. జరిమానా చెల్లించకపోతే కోర్టులో హాజరుపరచాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారని పేర్కొన్నాడు.
 
నవంబర్ 9, 2023న చలాన్ వచ్చిందని తుషార్ సక్సేనా వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించడం సాధారణమే, కానీ తన విషయంలో మాత్రం ఈ జరిమానా సరికాదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఎప్పుడూ కారును ఢిల్లీ (ఎన్ సీఆర్) ప్రాంతానికి తీసుకెళ్లలేదని, హెల్మెట్ ధరించి కారు నడపాలనే నిబంధన ఏదైనా ఉంటే అధికారులు తనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు. కాగా గతేడాది మార్చిలో తాను కారును కొనుగోలు చేశానని, వాహనం రిజిస్ట్రేషన్‌ను ఘజియాబాద్ నుంచి రాంపూర్‌కు మార్చుకున్నానని వివరించాడు. విచారణ జరిపి తన జరిమానాను రద్దు చేయాలంటూ నోయిడా ట్రాఫిక్ పోలీసులకు తుషార్ సక్సేనా విజ్ఞప్తి చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్కిల్‌ టు సెర్చ్‌తో సామ్‌సంగ్ గెలాక్సీ A55 5G, గెలాక్సీ A35 5G