ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌నత్‌లో ఓ దారుణం జరిగింది. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను ఓ భార్య సజీవదహనం చేసింది. ఈ కేసులో ఆమె ప్రియుడు, ఆమె మామతో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదైంది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, స్థానిక కందేరా గ్రామానికి చెందిన సన్నీకి గర్హీ కంగరాన్ గ్రామానికి చెందిన అంకితతో గత యేడాది పెళ్లి అయింది. ఈ నెల 22వ తేదీన కావడీ యాత్రలో భాగంగా గంగా జలం తీసుకొచ్చేందుకు సన్నీ బైకుపై హరిద్వార్ వెళ్లాడు. అయితే, కంగరాన్ గ్రామ రోడ్డు సమీపంలో నలుగురు వ్యక్తులు సన్నీ బైక్‌ను ఆపి అతనిపై దాడి చేశారు.
ఆ తర్వాత సన్నీని అంకిత తల్లిదండ్రులు తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ సన్నీపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితుడుని తొలుత మీరట్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి రిఫర్ చేయగా, అక్కడ చికిత్స పొందుతూ సన్నీ ప్రాణాలు విడిచాడు. మృతుని తండ్రి వేద్‌పాల్ ఫిర్యాదు మేరకు అంకిత, అయ్యూబ్, బేబీ, సుశీల్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.