ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మీరట్ జిల్లాలో ఓ బాలిక(15)ను నిర్బంధించి నెలరోజుల పాటు సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. జిల్లాలోని సర్ధానా పోలీస్ స్టేషన్ పరిధిలోని కంకేర్ ఖేరా ప్రాంతంలో ఈ దారుణం చోటుచేసుకుంది.
మైనర్ బాలికను విక్రయించేందుకూ నిందితుడు సిద్ధమయ్యాడు. బాధితురాలు నిందితుడి చెర నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం బయటపడింది.
ఈ కేసులో ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జనవరి 28న ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బాధితురాలి తల్లికి మూడు పెండ్లిండ్లు జరిగాయి. తనకు మాయమాటలు చెప్పి తల్లి తనను బయటకు తీసుకువెళ్లిందని అక్కడ ఇద్దరు యువకులు తనకు మత్తుపదార్ధాలు ఇచ్చి వారి ఇండ్లకు తీసుకువెళ్లారని బాధితురాలు తెలిపింది.
నిందితులు 45 రోజుల పాటు తనపై వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారని వెల్లడించింది. ఇక మార్చి 13న వారి చెర నుంచి బయటపడి పోలీసులను ఆశ్రయించింది. మరుసటి రోజు పోలీసులు ఆమె తల్లితో పాటు ఇద్దరు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధిత బాలిక తల్లి తొలుత రధ్నా గ్రామానికి చెందిన వ్యక్తిని పెండ్లి చేసుకుందని, ఆపై ఆర్మీలో పనిచేసే వ్యక్తితో రెండో పెండ్లి చేసుకోగా వారికి ఐదుగురు సంతానం కలిగారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రెండో భర్త మరణానంతరం ఆమె మూడోసారి పెండ్లి చేసుకుని ప్రస్తుతం కంకేర్ ఖేరాలో నివసిస్తోంది. నిందితులు ఇద్దరూ తరచూ మహిళ ఇంటికి వస్తుండేవారని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.