Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి

Advertiesment
kumaraswamy

ఠాగూర్

, శుక్రవారం, 17 జనవరి 2025 (19:04 IST)
ఇకపై విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ అనే ప్రశ్నే ఉత్పన్నంకాదని కేంద్ర ఉక్కు శాఖామంత్రి కుమారస్వామి తెలిపారు. పైగా, వచ్చే మూడేళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దేశంలోనే నంబర్ వన్‌గా చేస్తామని ఆయన చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల ఊబి నుంచి గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. 
 
దీనిపై కేంద్ర ఉక్క శాఖామంత్రి కుమార్ స్వామి మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను లాభాల్లోకి తేవడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న రెండు, మూడేళ్లలో ఫ్లాంట్‌ను దేశంలోనే మొదటి స్థానంలో నిలుపుతామని చెప్పారు. ఇకపై స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రసక్తే రాదని స్పష్టం చేశారు. శుక్రవారం ప్రకటించిన రూ.11440 కోట్ల ప్యాకేజీ మొదటిదేనని, భవిష్యత్‌లో మరిన్ని ఆర్థిక సాయాల ప్రకటనలు చేస్తామని పేర్కొన్నారు. 
 
విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ 
 
ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నినాదంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆదుకునేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఇందులోభాగంగా, విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ప్యాకేజీని ఇస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ఈ ప్యాకేజీకి కేంద్రమంత్రివర్గం బేషరతుగా ఆమోదం తెలిపినట్టు మంత్రి వెల్లడించారు. నష్టాల ఊబిలో ఉన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆదుకోవాలని లేదా సెయిల్‌లో విలీనం చేయాలంటూ కార్మికులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్న విషయంతెల్సిందే. ఇందులోభాగంగానే ఈ ఫ్యాక్టరీని ఆదుకునేందుకు కేంద్ర ముందుకు వచ్చింది. 
 
కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడంపై కేంద్ర మంత్రి కె.రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. 
 
ఈ ప్రకటించిన ప్యాకేజీలో రివైవల్ ప్యాకేజీకి కింద రూ.10,300 కోట్లు కేటాయించారని, ఉక్కు పరిశ్రమ నష్టాలను అధికమించేందుకు ఈ ప్యాకేజీ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. ఉక్కు పరిశ్రమ పూర్తిస్థాయిలో ఉత్పాదకతతో లాభాల బాటలో పయనించేందుకు ఈ ప్యాకేజీ దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. నవ్యాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధికి ఈ ప్యాకేజీ నిదర్శనమని రామ్మోహన్ వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాతో గడిపేందుకు హోటల్ గదికి రా, లేదంటే నీ ఏకాంత వీడియోలు బైటపెడతా: టెక్కీ సూసైడ్